పాక్ దౌత్యవేత్తకు చెన్నై ఎన్ఐఏ కోర్టు నోటీసులు

  • మనీలాండరింగ్ కేసులో సమన్లు
  • దాడులకు కుట్ర పన్నాడని కూడా సమన్లలో పేర్కొన్న కోర్టు
  • కరాచీలోని అతడి చిరునామాను కూడా నోటీసుల్లో పేర్కొన్న న్యాయస్థానం
  • 2014లో మొదటిసారి వెలుగుచూసిన వ్యవహారం
మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్‌కు చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్‌లపై దాడులకు కుట్ర పన్నారని కూడా ఈ సమన్లలో పేర్కొన్నారు. కరాచీలోని ఆయన చిరునామాను కూడా నోటీసుల్లో పేర్కొన్నారు.

సిద్ధిఖీ శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా చివరిగా విధులు నిర్వర్తించారు. 2018లో ఎన్ఐఏ ఆయనను వాంటెడ్ జాబితాలో చేర్చి, ఫొటోను కూడా విడుదల చేసింది. దక్షిణ భారతదేశంలో 26/11 తరహా దాడులకు కుట్ర పన్నారంటూ అదే ఏడాది ఛార్జీషీట్ దాఖలు చేసింది.

2009 నుంచి 2016 మధ్య శ్రీలంకలో పనిచేస్తున్న సమయంలో గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారితో ఆయన సంబంధాలు నెరిపాడని ఎన్ఐఏ తన దర్యాప్తులో గుర్తించింది.

2014లోనే సిద్ధిఖీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్ధిఖీ ఆదేశాల మేరకు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన శ్రీలంక జాతీయుడు మహమ్మద్ సఖీర్ హుస్సేన్ చెన్నైలో పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో పాక్ దౌత్యవేత్తపై తొలిసారిగా కేసు నమోదయింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆ కేసును అదే ఏడాది ఎన్ఐఏకు బదిలీ చేశారు.


More Telugu News