డేటింగ్ యాప్‌లో ప్రేమ.. వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!

  • డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం
  • విడతలవారీగా రూ. 25 లక్షల నగదు, 15 తులాల బంగారం కొట్టేసిన వైనం
  • పెళ్లి ప్రస్తావన తేగానే బ్లాక్‌మెయిల్‌కు దిగిన నిందితుడు
  • ప్రైవేట్ ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులు
 పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళా వైద్యురాలి నుంచి రూ. 25 లక్షల నగదు, 15 తులాల బంగారం కాజేసిన ఓ వ్యక్తి.. చివరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసి సొంతంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆమెకు గతేడాది ఓ డేటింగ్ యాప్ ద్వారా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం (32) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వారి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఇదే అదనుగా భావించిన సుబ్రహ్మణ్యం, తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ వైద్యురాలు, పలు దఫాలుగా అతనికి రూ. 25 లక్షల వరకు ఇచ్చారు. కేవలం ఆమె మాత్రమే కాకుండా, ఆమె తల్లి కూడా సుబ్రహ్మణ్యం మాటలను విశ్వసించి 15 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు.

ఇటీవల బాధితురాలు పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సుబ్రహ్మణ్యం అసలు స్వరూపం బయటపడింది. పెళ్లికి నిరాకరించడమే కాకుండా, ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను తన ఫోన్ నంబర్ మార్చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు, మంగళవారం రాత్రి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News