బాలాపూర్ వినాయకుడికి హుండీ ద్వారా కూడా ఘనంగా ఆదాయం!

  • హూండీ కానుకల ద్వారా బాలాపూర్ వినాయకుడికి రూ.23 లక్షల ఆదాయం వచ్చిందన్న కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి
  • గత ఏడాది కంటే రూ.5 లక్షలు పెరిగిందన్న నిరంజన్ రెడ్డి
  • ఈ ఏడాది భక్తులను విశేషంగా ఆకట్టుకున్న స్వర్ణపురి సెట్టింగ్
హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం లడ్డూ వేలం రికార్డు స్థాయిలో జరుగుతుంది. గత ఏడాది కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశుని లడ్డూను రూ.30.01 లక్షలకు దక్కించుకోగా, ఈసారి కూడా అందరి అంచనాలను అందుకుంటూ లడ్డూ రికార్డు ధర పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

హుండీ కానుకల ద్వారా రూ.5 లక్షలు పెరిగిన ఆదాయం

లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర పలకడమే కాకుండా, హుండీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఈసారి గణనీయంగా పెరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను ఉత్సవ కమిటీ సభ్యులు లెక్కించగా, రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. గత ఏడాది హుండీ ద్వారా వచ్చిన ఆదాయం సుమారు రూ.18 లక్షలు కాగా, ఈసారి దాదాపు రూ.5 లక్షల మేర అధికంగా వచ్చింది.

వర్షాన్ని జయించిన భక్తిభావం

ఈ సంవత్సరం వర్షాలు కురిసినప్పటికీ, భక్తుల సందడి ఏమాత్రం తగ్గలేదు. వేలాది సంఖ్యలో భక్తులు బాలాపూర్ గణేశుడిని దర్శించుకుని హుండీ ద్వారా కానుకలు సమర్పించారు.

ఆకట్టుకున్న స్వర్ణపురి సెట్టింగ్

ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణపురి సెట్టింగ్, గణేశుడి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల ప్రశంసలు పొందింది. భక్తులు ఆ సెట్టింగ్‌ వద్ద ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. 


More Telugu News