కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో కవలలకు జన్మనిచ్చిన యువతి

  • శ్రీకాకుళం స్టేషన్లో ఘటన
  • ఇచ్చాపురంకు చెందిన గర్బిణికి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే డెలివరీ చేసిన వైద్యురాలు
  • రైల్వే అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన భూలక్ష్మి దంపతులు  
రైలు ప్రయాణంలో ఓ గర్భిణి కవలలకు జన్మనిచ్చింది. శ్రీకాకుళంలో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరామ్‌తో కలిసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే జానకిరామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందికి సమాచారం అందించాడు. ఆర్పీఎఫ్ అధికారులు తక్షణమే స్పందించి శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపివేయగా, ఆర్పీఎఫ్ సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యురాలు డాక్టర్ పల్లవి కీర్తి గర్భిణి భూలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైలులోనే సురక్షితంగా ప్రసవం జరిపారు. ఈ సందర్భంగా భూలక్ష్మి ఇద్దరు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చింది.

అనంతరం, తల్లి, పిల్లలను మెరుగైన వైద్యం కోసం రాగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బందికి, వైద్యురాలు డాక్టర్ పల్లవి కీర్తికి, రైల్వే సిబ్బందికి భూలక్ష్మి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. 


More Telugu News