అది లోకేశ్ కు అడ్వాంటేజ్... కానీ!: సీఎం చంద్రబాబు

  • టెక్నాలజీ విషయంలో తన కంటే లోకేశ్ మెరుగ్గా ఉంటారని సీఎం చంద్రబాబు ప్రశంస
  • కానీ లోకేశ్ తనతో పోటీపడడం కష్టమేనని చమత్కారం
  • విజయవాడలో ఘనంగా జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • ఏ పరిస్థితుల్లోనూ విద్యాశాఖను నిర్లక్ష్యం చేయనని ఉపాధ్యాయులకు హామీ
  • మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశానని, పారదర్శకంగా పూర్తి చేశామని వెల్లడి
సాంకేతిక పరిజ్ఞానం విషయంలో తన కుమారుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తనకంటే మెరుగ్గా ఉంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బలమైన విజన్ ఉందని, అయితే కంప్యూటర్ సైన్స్ నేపథ్యం లోకేశ్ అడ్వాంటేజ్ అని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన లోకేశ్.. టెక్నాలజీని ఆచరణలో పెట్టడంలో తనకంటే ముందుంటారని ప్రశంసించారు. అయినప్పటికీ, లోకేశ్ నాతో పోటీ పడటం అంటే చాలా కష్టం అని చంద్రబాబు చమత్కరించారు. విజయవాడలో శుక్రవారం జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు సూచించారు. "టెక్నాలజీ విషయంలో కొన్నిసార్లు నా కంటే నా మనవడు దేవాన్ష్ వేగంగా ఉంటాడు. అలాగే తరగతి గదిలో మీకంటే విద్యార్థులు వేగంగా ఉంటే అది మీకు ఒక సవాల్ లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాధనాలను ఉపయోగించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి" అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని తీసుకురావాలనే లక్ష్యంతో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. యువత అవసరాలు, ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యావ్యవస్థ అభివృద్ధికి తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. "నేను ఏ విషయంలోనైనా కాస్త నిర్లక్ష్యం చేస్తానేమో గానీ, విద్యాశాఖను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయను. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెట్టాను. ఎలాంటి వివాదాలు లేకుండా ఆ ప్రక్రియను అద్భుతంగా పూర్తి చేశాం" అని గుర్తుచేశారు. గతంలో ఉపాధ్యాయులు బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చేదని, ఆ దుస్థితిని మార్చేందుకే తాను తొలిసారి కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టానని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను పవిత్రంగా ఉంచుతున్నామని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ వంటి మహనీయుల పేర్లు పెట్టడం శుభ పరిణామమని కొనియాడారు. విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించేందుకు 'నో బ్యాగ్ డే' ప్రవేశపెట్టడం, పేద విద్యార్థులకు 'తల్లికి వందనం' ద్వారా ఆర్థిక చేయూత అందించడం వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. "ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యానో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్లలో జరిగింది. అయినా ప్రజలు మాపై నమ్మకంతో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బాగోగులు చూసుకునే బాధ్యత నాది. మీరంతా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్-1గా నిలపాలన్నదే నా ఆకాంక్ష" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 


More Telugu News