పోర్చుగల్ లో భారత గ్యాంగుల ఆధిపత్య పోరు... తెరపైకి బిష్ణోయ్ గ్యాంగ్!

  • పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో భారత గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులు
  • ప్రత్యర్థి వర్గంపై తామే దాడి చేశామంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటన
  • తమదే బాధ్యత అన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రణదీప్ మాలిక్
  • హెచ్చరికలు పట్టించుకోనందుకే కాల్పులు జరిపినట్టు వెల్లడి
  • కెనడా తర్వాత ఇప్పుడు యూరప్‌లోనూ విస్తరించిన భారత గ్యాంగ్ వార్
  • ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ రణదీప్ మాలిక్
భారతదేశంలోని గ్యాంగ్‌స్టర్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు ఖండంతరాలు దాటింది. కెనడా తర్వాత తాజాగా యూరప్‌లోని పోర్చుగల్‌కు కూడా ఈ గ్యాంగ్ వార్ వ్యాపించింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ప్రత్యర్థి గ్యాంగ్ స్థావరంపై జరిగిన కాల్పులకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఓ కీలక సభ్యుడు ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ రణదీప్ మాలిక్ అలియాస్ రణదీప్ సింగ్ ఈ దాడికి బాధ్యత వహించాడు. లిస్బన్‌లోని ఓడివెలస్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పులు తానే చేయించానని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. "పోర్చుగల్‌లో అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న రోమీ, ప్రిన్స్ తమ పనులు ఆపాలని హెచ్చరించాం. మా హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. అందుకే ఈ కాల్పులు జరిపాం. మేం పిలిచినప్పుడు ఫోన్ ఎత్తకపోతే, ప్రపంచంలో ఎక్కడున్నా బుల్లెట్లు నేరుగా వస్తాయి" అని ఆ పోస్టులో మాలిక్ పేర్కొన్నాడు.

భారత గ్యాంగ్‌స్టర్లకు సంబంధించి పోర్చుగల్‌లో ఇలాంటి పెద్ద గ్యాంగ్ వార్ జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్పులకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రోమీ, ప్రిన్స్ గ్యాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్, అతని అనుబంధ గ్యాంగ్‌లు విదేశీ గడ్డపై దాడులకు పాల్పడటం పెరిగిపోయింది. ఇటీవలే కెనడాలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై రెండుసార్లు కాల్పులు జరిపారు. 2024లో కెనడాలోనే ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ సోను చిత్తాతో పాటు, ఉగ్రవాది సుఖా దూనీని కూడా వీరు హత్య చేశారు.

ఇదిలా ఉండగా, గత నెలలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు రణదీప్ మాలిక్‌ను అదుపులోకి తీసుకుని, తర్వాత విడుదల చేశారు. 2024 నవంబర్‌లో చండీగఢ్‌లోని ప్రముఖ సింగర్ బాద్షాకు చెందిన క్లబ్‌తో పాటు మరో క్లబ్‌పై జరిగిన పేలుళ్ల కేసులోనూ మాలిక్ పేరు ఉంది.


More Telugu News