గణేశ్ మండపం పక్కనే చికెన్‌ భోజనాలు.. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురిపై కేసు

  • నందిగామలో వైసీపీ నేతలపై కేసు నమోదు
  • వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా చికెన్ బిర్యానీ పంపిణీ
  • గణేశ్ మండపం పక్కనే అన్నదానం ఏర్పాటు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా పలువురు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వినాయక మండపం సమీపంలో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేయడమే ఈ కేసుకు కారణం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నిన్న నందిగామ గాంధీ సెంటర్‌లో వైసీపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రజలకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. అయితే, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రదేశానికి సమీపంలోనే గణేశ్ మండపం ఉంది.

గణేశ్ మండపం పక్కన మాంసాహారంతో భోజనాలు పెట్టడం, కార్యక్రమానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై శాతకర్ణి స్వయంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌తో పాటు మరో 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


More Telugu News