అమెరికా నుంచి ఇండోనేషియా వరకు.. గణనాథుడికి విశ్వవ్యాప్త ఆరాధన

  • భారతదేశానికే పరిమితం కాని వినాయక చవితి వేడుకలు
  • ముస్లిం దేశమైన ఇండోనేషియా కరెన్సీపై గణపతి చిత్రం
  • అమెరికా న్యూయార్క్‌లో ప్రసిద్ధి చెందిన మహావల్లభ వినాయక ఆలయం
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం థాయ్‌లాండ్‌లో ఏర్పాటు
  • శ్రీలంక, నేపాల్, మలేషియా, నెదర్లాండ్స్‌లోనూ గణనాథుడికి ప్రత్యేక పూజలు
  • మయన్మార్‌లో వినాయకుడిని బ్రహ్మదేవుడిగా భావించి ఆరాధన
వినాయక చవితి అనగానే మన దేశంలో పల్లె నుంచి పట్నం వరకు వీధివీధినా మండపాలు, భారీ విగ్రహాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే, ఆ బొజ్జ గణపయ్య వైభవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి, ఖండంతరాలు దాటి విశ్వవ్యాప్తమైంది. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా తమ కరెన్సీ నోటుపై గణపతి చిత్రాన్ని ముద్రించిందంటేనే ఆయన కీర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇండోనేషియాలో విఘ్నేశ్వరుడికి లభించే గౌరవం చాలా ప్రత్యేకం. అక్కడి బాలి దీవిలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి. విద్యా, నిర్మాణ సంస్థలలో వినాయకుడి విగ్రహాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లలో కూడా గణనాథుడికి విశేష పూజలు అందుతున్నాయి. నేపాల్‌లోని సూర్యవినాయక ఆలయం, శ్రీలంకలోని పిళ్లయార్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక మయన్మార్‌లో వినాయకుడిని బ్రహ్మదేవుడిగా భావించి ఆరాధించడం ఒక ప్రత్యేకత.

ఆసియా దేశాల్లోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లోనూ గణపతి పూజలు ఘనంగా జరుగుతాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న మహావల్లభ వినాయక దేవాలయం "ఫ్లషింగ్ టెంపుల్"గా స్థానిక భక్తులకు సుపరిచితం. యూరోప్‌లోని నెదర్లాండ్స్‌లో శ్రీలంక తమిళులు నిర్మించిన శ్రీ వరతరాజ సెల్వవినాయకర్ ఆలయం హిందూ సంప్రదాయానికి కేంద్రంగా నిలుస్తోంది. థాయ్‌లాండ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం కొలువై ఉండగా, మలేషియాలోనూ గణపతి ఆలయాలు భక్తులతో కళకళలాడుతుంటాయి.

ఇలా విజ్ఞానం, విజయానికి ప్రతీకగా నిలిచే వినాయకుడు.. కులమతాలకు, దేశాల సరిహద్దులకు అతీతంగా విశ్వవ్యాప్తంగా పూజలు అందుకుంటూ తన విశిష్టతను చాటుకుంటున్నాడు.



More Telugu News