కొడుకు, కూతురే కాడెద్దులుగా... ఓ రైతు దయనీయ పరిస్థితి!

  • కూలీల ఖర్చు భరించలేక.. పిల్లలతోనే పొలం పని చేయిస్తున్న అన్నదాత
  • కూలీల ఖర్చు తలకు మించిన భారమై..
  • కన్నబిడ్డలకే కాడి కట్టిన తండ్రి
  • మూడు ఎకరాల చామంతి పొలంలో కలుపు తీత
  • గిట్టుబాటు ధరపై రైతు తీవ్ర ఆందోళన
కడప జిల్లాలో ఓ రైతు కూలీలను పెట్టుకునే స్థోమత లేక, తన కన్నబిడ్డలనే కాడికి కట్టి పొలం పనులు చేస్తున్న హృదయ విదారక దృశ్యం పలువురిని కదిలిస్తోంది.

వివరాల్లోకి వెళితే, పెండ్లిమర్రి గ్రామానికి చెందిన రైతు బండి శేఖర్ రెడ్డి తనకున్న మూడు ఎకరాల పొలంలో చామంతి పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పొలంలో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని తొలగించడానికి కూలీల ఖర్చు తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు, పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లభిస్తుందనే నమ్మకం కూడా లేదు.

ఈ ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏం చేయాలో పాలుపోని శేఖర్ రెడ్డి, తన కుమారుడు, కుమార్తె సహాయంతోనే కలుపు తీయాలని నిర్ణయించుకున్నాడు. తేలికపాటి కాడిని తన పిల్లలకు కట్టి, వారితోనే కలుపు తీసే యంత్రాన్ని లాగిస్తున్న దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. 

ఈ విషయంపై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, "పంటకోత సమయానికి గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో అనే అనిశ్చితి ఉంది. అందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చింది" అని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ ఘటన క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది.


More Telugu News