హిందూపురం వాసులకు గుడ్ న్యూస్

  • కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌కు కొత్త హాల్ట్
  • హిందూపురం స్టేషన్‌లో ఆగనున్న వందేభారత్ రైలు
  • కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న ప్రకటన
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 20703) రైలుకు హిందూపురంలో హాల్ట్ కల్పిస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయంతో హిందూపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

కొత్తగా మంజూరు చేసిన ఈ హాల్ట్ ప్రకారం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రయాణిస్తూ 11.40 గంటలకు హిందూపురం స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరే ఈ రైలు, రాత్రి 11 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. అయితే, హిందూపురంలో ఈ కొత్త హాల్ట్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు త్వరలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రకటన కోసం స్థానిక ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



More Telugu News