120కి పైగా దేశాలు తిరిగాడు.. అత్యంత జాత్యహంకార దేశం ఇదేనంటూ ఇండియన్ యూట్యూబర్ సంచలన వీడియో!

  • 120 దేశాలు తిరిగిన భారతీయ ట్రావెలర్ 'ఎక్స్‌ప్లోరర్ రాజా' ఆరోపణలు
  • జార్జియా అత్యంత జాత్యహంకార దేశమంటూ సంచలన వీడియో పోస్ట్
  • ఎయిర్‌పోర్టులో నగ్నంగా నిలబెట్టి తనిఖీ చేశారంటూ ఆవేదన
  • నల్లగా ఉన్నాననే వివక్ష చూపించారని ఆరోపణ
  • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన.. వైరల్ అయిన రాజా పోస్ట్
ప్రపంచాన్ని చుట్టిరావడం అంటే చాలామందికి ఇష్టం. కానీ, ఆ ప్రయాణాల్లో కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ భారతీయ ట్రావెలర్‌కు ఎదురైంది. ఇప్పటివరకు 120కి పైగా దేశాల్లో పర్యటించిన 'ఎక్స్‌ప్లోరర్ రాజా' అనే కంటెంట్ క్రియేటర్, తనకు ఎదురైన అత్యంత దారుణమైన జాత్యహంకార అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాను చూసిన దేశాల్లో జార్జియా అత్యంత జాత్యహంకార దేశమని ఆయన ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో రాజా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 2019లో తొలిసారి జార్జియా వెళ్లినప్పుడు, అవసరమైన అన్ని పత్రాలు, వీసాలు ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్టులో ఎలాంటి కారణం చెప్పకుండా నాలుగు గంటలపాటు నిలబెట్టారని తెలిపాడు. అక్కడి నుంచి పారిస్ వెళ్తుండగా, ఎయిర్‌పోర్టులో తనను నగ్నంగా నిలబెట్టి ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారని ఆరోపించాడు. "భారతీయులు పర్యాటకులుగా రాలేరన్నట్టుగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌లోని ఓ మహిళ నన్ను ప్రశ్నించింది" అని రాజా పేర్కొన్నాడు.

"ఆరేళ్ల తర్వాత మూడు పాస్‌పోర్టుల నిండా వీసా స్టాంపులతో మళ్లీ వెళ్లాను. ఈసారైనా వాళ్ల వైఖరి మారుతుందనుకున్నా. కానీ, నా నల్లటి ముఖాన్ని చూసి మళ్లీ అదే రకమైన వివక్ష చూపించారు. నేను పర్యటించిన 120 దేశాల్లో నన్ను తీవ్రంగా బాధపెట్టిన కొన్ని దేశాల్లో ఇది ఒకటి" అని రాజా తన పోస్టులో రాసుకొచ్చాడు.

రాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు తాము కూడా జార్జియాలో ఇలాంటి అవమానాలనే ఎదుర్కొన్నామని చెబుతున్నారు. "జార్జియా అందమైన దేశమే కానీ, అక్కడి స్థానికులు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు" అని ఒకరు కామెంట్ చేయగా... "మీరు చెప్పింది 100% నిజం" అని మరొకరు రాజాకు మద్దతు తెలిపారు. అయితే, మరికొందరు మాత్రం తమ అనుభవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. జార్జియా ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, తమ పర్యటన ఎంతో ఆనందంగా సాగిందని కామెంట్లు పెడుతున్నారు. 


More Telugu News