యుద్ధం ఆపడానికి ఉక్రెయిన్ భూభాగం కోరిన పుతిన్.. జెలెన్ స్కీ ఏమన్నారంటే?

  • అలాస్కా భేటీ తర్వాత జెలెన్ స్కీకి ట్రంప్ ఫోన్ కాల్
  • తమ భూభాగాన్ని వదులుకునేది లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • రేపు వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ కానున్న జెలెన్ స్కీ
ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో శనివారం అలాస్కాలో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చర్చలు సామరస్య ధోరణిలో జరిగాయని ఇరు దేశాల అధినేతలు ప్రకటించారు. యుద్ధ విరమణకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ శాంతి నెలకొల్పేందుకు పుతిన్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. యుద్ధం ఆపేందుకు పుతిన్ పలు షరతులు విధించారని తెలుస్తోంది.

ఈ సమావేశం అనంతరం ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడారు. యుద్ధ విరమణకు పుతిన్ ప్రధానంగా విధించిన షరతును ఆయనకు వివరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని డొనెట్స్క్ రీజియన్ ను తమకు వదిలివేయాలని, ఆ ప్రాంతం మొత్తాన్నీ స్వాధీనం చేయాలని పుతిన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ డిమాండ్ ను ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి వివరించగా.. తమ భూభాగాన్ని వదులుకునేందుకు జెలెన్ స్కీ ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
 
డొనెట్స్క్, లుహాన్ స్క్ ప్రాంతాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ ఉక్కు, బొగ్గును తవ్వితీస్తున్నారు. భౌగోళికంగా ఈ ప్రాంతాలు ఉక్రెయిన్ లో అంతర్భాగంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇందులో చాలా భాగం రష్యా ఆక్రమించింది. కేవలం 30 శాతం ప్రాంతమే ఉక్రెయిన్ అధీనంలో ఉంది. ఇప్పుడు ఈ భాగాన్ని కూడా స్వాధీనం చేయాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News