మా నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ ఎంతో సాయం చేశారు: మంచు లక్ష్మీ

  • నా తండ్రి, రజనీకాంత్ మంచి స్నేహితులన్న మంచు లక్ష్మి
  • రజనీకాంత్ ఎంత గొప్ప వ్యక్తో మేం పెద్దయ్యాక తెలిసిందని వ్యాఖ్య
  • మోహన్ బాబు, రజనీకాంత్ కలిసినప్పుడల్లా చిన్నపిల్లల్లా మారిపోతారన్న మంచు లక్ష్మి
తన తండ్రి మోహన్ బాబు కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంతో సహాయం చేశారని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమం వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

తన తండ్రి, రజనీకాంత్ మంచి స్నేహితులని, చిన్నప్పుడు పుట్టిన రోజులకు ఆయన తప్పకుండా వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన తమతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని తెలిపారు. రజనీకాంత్ ఎంత గొప్ప వ్యక్తో తమకు పెద్దయ్యాక తెలిసిందని ఆమె అన్నారు. వారిద్దరు కలిసినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోతారని పేర్కొన్నారు.

వారి స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. వారిద్దరూ కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరి కోసం మరొకరు నిలబడ్డారని తెలిపారు. తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్‌స్టార్ ఎంతో సాయం చేశారని అన్నారు. సాధారణంగా రజనీకాంత్ తక్కువ నిడివి ఉన్న పాత్రలను చేయరని, కానీ తన తండ్రి కోసం 'పెదరాయుడు' సినిమాలో నటించారని తెలిపారు.

ఆ సినిమా తనకు గుర్తింపు తెస్తుందా లేదా అని రజనీకాంత్ చూడలేదని, తన తండ్రి అడిగిన వెంటనే నటించారని తెలిపారు. అలాగే తన తండ్రి కోసం 'రాయలసీమ రామన్న చౌదరి' కథను అందించారని, వారిద్దరిది అంత గొప్ప స్నేహమని ఆమె తెలిపారు. నటుడిగానే కాకుండా గొప్ప వ్యక్తిగానూ రజనీకాంత్ ఎంతోమందికి ఆదర్శమని అన్నారు. 'కూలీ' సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానని, అందుకే ఈరోజు కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నానని తెలిపారు.


More Telugu News