పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజ‌యంపై బీటెక్ ర‌వి కీల‌క వ్యాఖ్య‌లు

  • పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘ‌న విజ‌యం
  • 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డి
  • త‌న అర్ధాంగి లతారెడ్డి భారీ విజ‌యంపై బీటెక్ ర‌వి స్పంద‌న‌
  • జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌నే ఆలోచ‌న‌తోనే ప్ర‌జ‌లు గెలిపించార‌ని వ్యాఖ్య‌
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యంపై ఆ పార్టీ నేత బీటెక్ ర‌వి మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌నే ప్ర‌జ‌ల ఆలోచ‌న‌తో పాటు, టీడీపీ అమ‌లు చేసిన ప‌థ‌కాలే పార్టీ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని ఆయ‌న‌ అన్నారు. 

గ‌తంలో పులివెందుల‌లో ధైర్యంగా ఓటు వేసే ప‌రిస్థితులు వుండేవి కాదనీ, తాము ప్ర‌జ‌ల‌కు ఆ భ‌రోసా క‌ల్పించామ‌ని అన్నారు. గ‌తంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాల‌కు రానీయ‌కుండా చేశార‌ని, ఇవాళ ప్ర‌జ‌లు స్వేచ్ఛాయు‌త వాతావ‌ర‌ణంలో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని తెలిపారు. అందుకే ఈ రోజు ఈ అద్భుత ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని బీటెక్ ర‌వి చెప్పుకొచ్చారు.  

ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీకి ఓట్లు వేస్తార‌నేందుకు నిద‌ర్శ‌నం ఈ ఎన్నిక‌లు అని మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు టీడీపీకి భారీ విజ‌యాన్ని అందించార‌ని అన్నారు. వైసీపీ చేతుల్లో ఉన్న సిట్టింగ్ స్థానాల‌ను గెలుచుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని మంత్రి చెప్పారు.  

కాగా, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 8,103 ఓట్లు పోలైతే.. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడడంతో ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు.


More Telugu News