రమ్యకృష్ణ గారు ఆ సీన్ చేయనంటూ ఏడ్చేశారు: కేఎస్ రవికుమార్

  • 'ముత్తు'తో రజనీ సార్ కి హిట్ ఇచ్చాను 
  • 'నీలాంబరి'గా మీనా సెట్ కాదని చెప్పాను
  • నగ్మాను అనుకుంటే కుదరలేదు  
  • అలా రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చిందన్న రవికుమార్ 
  • థియేటర్లో ఆ సీన్ బాగా పేలిందని వెల్లడి

కోలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్స్ లో కేఎస్ రవికుమార్ ఒకరుగా కనిపిస్తారు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు."తమిళంలో నేను చేసిన 'నాట్టమై' సినిమాను తెలుగులో 'పెదరాయుడు'గా రీమేక్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తమిళంలో ఆ పాత్రకి రజనీకాంత్ ను నేను అడగలేదు. ఎందుకంటే అప్పటికి నాకు రజనీ సార్ తెలియదు" అని అన్నారు.

''నా గురించి తెలిసిన తరువాత రజనీ సార్ నన్ను పిలిపించి మంచి కథను రెడీ చేయమని చెప్పారు. అప్పుడు నేను సిద్ధం చేసుకున్న కథనే 'ముత్తు'. ఆ సినిమా తమిళ .. తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి రజనీ సార్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఆయనతో చేసిన 'నరసింహ' .. 'లింగ' సినిమాలలో, 'నరసింహ' రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాతో రమ్యకృష్ణ గారికి ఎంతోమంచి పేరు వచ్చింది" అని అన్నారు. 

"ఈ సినిమాలో 'నీలాంబరి' పాత్రకి మీనా అయితే బాగుంటుందని అనుకున్నారు. కన్నింగ్ గా కనిపించే ఆ పాత్రకి మీనా సెట్ కాదనీ, ఆమె ఫేస్ లో పసితనం కనిపిస్తూ ఉంటుందని అన్నాను. 'నగ్మా'గారు గానీ .. రమ్యకృష్ణగారు గాని అయితే బాగుంటుందని చెప్పాను. చివరికి రమ్యకృష్ణగారు ఓకే అయ్యారు. ఈ సినిమాలో తన పాదంతో ఆమె సౌందర్య చెంపను తాక వలసి ఉంటుంది. ఆ సీన్ చేయనని రమ్యకృష్ణ ఏడ్చేసింది. మరేం ఫరవాలేదంటూ సౌందర్యనే ఆమె పాదాన్ని తీసుకుని చెంప దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ సీన్ .. సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది" అని చెప్పారు. 



More Telugu News