భారీ వ‌ర్ష సూచ‌న‌.. తెలంగాణ‌లోని ఐదు జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వులు

  • భారీ వ‌ర్ష సూచ‌న నేపథ్యంలో విద్యాశాఖ ఉత్తర్వులు
  • ఇవాళ‌, రేపు సెల‌వు ప్ర‌క‌టించిన పాఠశాల విద్యాశాఖ 
  • వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని స్కూళ్ల‌కు వ‌ర్తింపు
  • హైదరాబాద్‌ పరిధిలోని పాఠశాలలను ఈ రెండు రోజులు ఒంటిపూట బ‌డులు
తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ‌, రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ రెండు రోజులు ఒంటిపూట బ‌డులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీచేశారు.

మ‌రోవైపు, మూడు రోజుల పాటు అన్ని శాఖ‌ల ఉద్యోగుల‌కు సెల‌వులు ర‌ద్దు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైద‌రాబాద్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇంఛార్జ్ మంత్రులు, అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. 

ఇక‌, ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌స్తే, ఎయిర్‌లిఫ్టింగ్‌కు హెలికాప్ట‌ర్లు సిద్ధంగా ఉండేలా చూడాల‌ని తెలిపారు. అలాగే హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌ల‌పై హైడ్రా అలర్ట్‌గా ఉండాల‌ని సూచించారు. ఐటీ ఉద్యోగులు వ‌ర్క్‌ఫ్రమ్ హోం చేసేలా అప్ర‌మ‌త్తం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.    


More Telugu News