తిరుప్పూర్ ఎస్సై హత్య కేసు.. ప్రధాన నిందితుడి కాల్చివేత

  • తండ్రీకొడుకుల గొడవను ఆపేందుకు వెళ్లి వారి చేతిలో హత్యకు గురైన ఎస్ఎస్సై
  • పోలీసులపై దాడికి యత్నించిన ప్రధాన నిందితుడు
  • ఎదురు కాల్పుల్లో మణికందన్ మృతి
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా గుడిమంగళం గ్రామంలో 57 ఏళ్ల స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఎస్సై) ఎం. షణ్ముగవేల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎం. మణికందన్ ఈ తెల్లవారుజామున పోలీసు కాల్పుల్లో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని దాచిన ప్రదేశానికి మణికందన్‌ను తీసుకువెళుతున్నప్పుడు, ఒక ఎస్సైపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. 

ఎస్ఎస్సై హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందం మణికందన్‌ను గుడిమంగళం సమీపంలోని చిక్కనూర్ వద్ద ఉన్న ఉప్పారు డ్యామ్ సమీపంలోని వాగు వద్దకు తీసుకువెళ్లింది. నిందితుడు అక్కడ మణికందన్ హత్యకు ఉపయోగించిన కొడవలిని దాచాడు. ఈ క్రమంలో ఎస్సై శరవణకుమార్‌పై కొడవలితో దాడి చేసి తప్పించుకోవడానికి నిందితుడు ప్రయత్నించాడు.

దీంతో తమను తాము రక్షించుకోవడానికి, మణికందన్ తప్పించుకోకుండా అడ్డుకునేందుకు ఇన్‌స్పెక్టర్ తిరుంగగాసాంబందన్ నేతృత్వంలోని బృందం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మణికందన్ అక్కడికక్కడే మరణించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరుప్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

పోలీస్ అధికారి హత్య ఎలా జరిగింది?
మణికందన్, అతడి తండ్రి మూర్తి అలియాస్ తువకుడియన్ (65), సోదరుడు తంగపాండియన్‌తో కలిసి అన్నాడీఎంకే ఎమ్మెల్యే సి.మహేంద్రన్‌ పొలంలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు కొడుకులు తండ్రిపై దాడి చేయగా, పొరుగువారు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న గుడిమంగళం పోలీస్ స్టేషన్‌ స్పెషల్ సబ్ఇన్‌స్పెక్టర్ షణ్ముగవేల్, కానిస్టేబుల్ అళగు రాజా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షణ్ముగవేల్ జోక్యం చేసుకుని మూర్తిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంపై ఆగ్రహించిన మణికందన్ కొడవలితో షణ్ముగవేల్‌పై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత మాణికందన్, అతని సోదరుడు, తండ్రి కలిసి కానిస్టేబుల్, ఫామ్ మేనేజర్‌పై కూడా దాడికి యత్నించారు. వారు తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు మణికందన్ పోలీసు కాల్పుల్లో మరణించాడు.


More Telugu News