ఇలాంటి గూండాల వల్లే ధర్మస్థలంకు కళంకం వస్తోంది: ప్రకాశ్ రాజ్

  • కలకలం రేపుతున్న ధర్మస్థలం హత్యలు 
  • సామూహిక అంత్యక్రియలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి
  • హత్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలంలో చోటుచేసుకున్న అంతుచిక్కని హత్యల వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో నిన్న ధర్మస్థలంలో సామూహిక అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంత్యక్రియలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన పంగలలోని దివంగత సౌజన్య నివాసానికి సమీపంలో జరిగింది.  

మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన కొందరు వారి వద్దకు వచ్చి దాడి చేశారు. తప్పుదారి పట్టించే నివేదికలను వ్యాప్తి చేస్తున్నారంటూ దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు యూట్యూబర్ల కెమెరాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జనసమూహాన్ని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. గాయపడిన మీడియా ప్రతినిధులను ఉజిరేలోని ఆసుపత్రికి తరలించారు. 

మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఖండించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే పవిత్రమైన ధర్మస్థలంకు కళంకం వస్తోందని మండిపడ్డారు. సౌజన్య దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే... వారికి కోపం ఎందుకని ప్రశ్నించారు. ఈ హత్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి నిజాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News