ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక... ఇక విడాకులేనా?

  • భర్త సోహైల్‌తో హన్సిక విడాకులంటూ కొద్ది రోజులుగా ప్రచారం
  • ఇన్‌స్టాగ్రామ్ నుంచి తమ పెళ్లి ఫొటోలను తొలగించిన నటి
  • తాజా చర్యతో విడాకుల ఊహాగానాలకు మరింత బలం
  • ప్రస్తుతం ‘శ్రీ గాంధారి’ సినిమాతో బిజీగా ఉన్న నటి
ప్రముఖ నటి హన్సిక మోత్వానీ తన వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్త సోహైల్ కతూరియాతో దిగిన పెళ్లి ఫొటోలను ఆమె తొలగించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్యతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది.

కొంతకాలంగా తన ప్రియుడు సోహైల్‌తో ప్రేమలో ఉన్న హన్సిక, 2022 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. అయితే, గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సోహైల్ స్పందించి, వాటిని ఖండించినప్పటికీ, హన్సిక మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ పుకార్లు నిజమేనని పలువురు భావిస్తున్నారు.

వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ, హన్సిక తన సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల ‘గార్డియన్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ప్రస్తుతం ‘శ్రీ గాంధారి’ అనే ఆసక్తికరమైన ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. 


More Telugu News