కొడుకుకు పేరు పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఆ పేరు వెనుక ఆసక్తికర కారణం

  • హీరో కిరణ్ అబ్బవరం కుమారుడికి నామకరణం
  • 'హను అబ్బవరం'గా పేరు పెట్టిన దంపతులు
  • తిరుమల శ్రీవారి సన్నిధిలో ఘనంగా వేడుక
  • ఆంజనేయ స్వామిపై భక్తితో 'హను' అని నామకరణం
  • ప్రస్తుతం 'కే రాంప్' సినిమాతో బిజీగా ఉన్న కిరణ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఆయన అర్ధాంగి రహస్య తమ కుమారుడికి నామకరణం చేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తమ ముద్దుల కొడుకుకు ‘హను అబ్బవరం’ అని పేరు పెట్టినట్లు ఈ దంపతులు ప్రకటించారు. శ్రీవారి ఆశీస్సులతో పాటు, ఆంజనేయ స్వామి అనుగ్రహం తమ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. "ఆంజనేయ స్వామి అంటే మాకు ఎంతో భక్తి. ఆయనకు గుర్తుగా మా అబ్బాయికి 'హను' అని పేరు పెట్టాం. శ్రీవారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు మా ఇద్దరికీ ఎంతో భావోద్వేగభరితంగా, మధురంగా మిగిలిపోతాయి" అని ఆయన అన్నారు.

కిరణ్, రహస్య దంపతులకు ఈ ఏడాది మే నెలలో హనుమాన్ జయంతి పర్వదినాన కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. బాబు పుట్టిన శుభ సందర్భాన్ని, ఇప్పుడు నామకరణ వేడుకను దైవభక్తితో జరుపుకోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుమలలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'కే రాంప్' అనే చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, తన సొంత నిర్మాణ సంస్థ 'కేఏ ప్రొడక్షన్స్' ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు.




More Telugu News