ట్రంప్ మాట అబద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థ భేష్: ఏఐ

  • భారత ఆర్థిక వ్యవస్థ ప‌త‌న‌మైంద‌న్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • ట్రంప్ వాదనను ఖండించిన చాట్‌జీపీటీ, జెమిని వంటి అమెరికన్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లు
  • భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలను అబద్ధమని తేల్చేసిన అమెరికన్ ఏఐ
భారత్‌ది డెడ్ ఎకాన‌మీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలను ఆయన సొంత దేశంలోనే అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు ఖండించాయి. భారత ఆర్థిక వ్యవస్థ నిర్జీవంగా లేదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని స్పష్టం చేశాయి.

భారత దిగుమతులపై 25 శాతం భారీ సుంకం (టారిఫ్) విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దీనిపై స్పష్టత కోసం ఎన్డీటీవీ సంస్థ.. అమెరికాకు చెందిన ఐదు ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లైన చాట్‌జీపీటీ, గ్రోక్, జెమిని, మెటా ఏఐ, కోపైలట్‌లను "భారత్‌ది డెడ్ ఎకాన‌మీయా?" అని ప్రశ్నించింది. 

దీనికి అవన్నీ ఏకగ్రీవంగా "లేదు" అనే సమాధానం ఇచ్చాయి. "భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోలేదు, చాలా చురుగ్గా, ప్రతిష్ఠాత్మకంగా ఉంది" అని చాట్‌జీపీటీ చెప్పగా, "అసలు ఆ మాటే నిజం కాదు, దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి" అని కోపైలట్ తేల్చి చెప్పింది. "భారత ఆర్థిక వ్యవస్థ ప‌త‌నం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది" అని గ్రోక్ తెలిపింది. 

"భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధితో దూసుకెళ్తోంది" అని జెమిని అంది. అలాగే మెటా ఏఐ కూడా "భారత్‌ది డెడ్ ఎకాన‌మీ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి" అని చెప్పింది. ఇలా అమెరిక‌న్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌న్నీ కూడా ఒకే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ మాటలు అబద్ధమని తేల్చేశాయి. 


More Telugu News