మోహన్ భగవత్‌ను అరెస్టు చేయమని ఆదేశాలు వచ్చాయి.. నిరాకరిస్తే నాపై తప్పుడు కేసులు పెట్టారు: మాజీ అధికారి మహబూబ్

  • మాలేగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి ఏటీఎస్ మాజీ అధికారి మహబూబ్ ముజావ్ సంచలన ఆరోపణలు
  • భగవత్ సహా పలువురిని అరెస్టు చేయమంటూ తనకు ఆదేశాలు వచ్చాయని వెల్లడి
  • తాను నిరాకరించడంతో తనపై తప్పుడు కేసులు పెట్టారన్న మహబూబ్ ముజావ్
  • ఆ కేసుల నుంచి తాను నిర్దోషిగా బయటపడ్డానని వెల్లడి
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఏటీఎస్ మాజీ అధికారి మహబూబ్ ముజావ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ సహా పలువురిని అరెస్టు చేయాలని తనకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న ఓ మసీదు సమీపంలో పేలుడు సంభవించింది. మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్, రమేశ్ ఉపాధ్యాయ, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదయింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.

నాటి కేసు విచారణ బృందంలో ఉన్న మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్ ముజావ్ మాట్లాడుతూ, మోహన్ భగవత్‌ను అరెస్టు చేయాలని తనకు ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి కొంతమంది వ్యక్తులను అరెస్టు చేయాలని తనకు ఆదేశాలు వచ్చాయని అన్నారు. వారిలో రామ్ కల్సంగ్రా, సందీప్ దాంగే, దిలీప్ పాటిదార్‌తో పాటు మోహన్ భగవత్ పేరు కూడా ఉందని తెలిపారు.

మోహన్ భగవత్ వంటి వ్యక్తిని అరెస్టు చేయడం తన శక్తికి మించిన పని అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న పరమ్‌బీర్ సింగ్‌తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు తనకు ఈ ఆదేశాలు ఇచ్చారని ఆయన వెల్లడించారు.

తనకు సహాయంగా ఉండేందుకు రాష్ట్రం నుంచి 10 మంది సిబ్బందిని సమకూర్చారని, నిధులు, రివాల్వర్ ఇచ్చారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించేందుకు తాను నిరాకరించానని, దీంతో తనపై కూడా తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాటన్నింటిలో తాను నిర్దోషిగా బయటకు వచ్చానని ఆయన వెల్లడించారు.


More Telugu News