భూకంపం వచ్చి ఆపరేషన్ థియేటర్ ఊగుతున్నా.. సర్జరీ పూర్తి చేసిన వైద్యులు (వీడియో)

  • రష్యా తీరంలో 8.8 తీవ్రతతో కామ్చాట్కా ద్వీపకల్పంలో భూకంపం
  • కమ్చట్కా ప్రాంతంలో ఊగిపోయిన భవనాలు
  • సిబ్బంది స్ట్రెచర్‌ను గట్టిగా పట్టుకోగా, సర్జరీ పూర్తి చేసిన వైద్యులు
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రత నమోదవడంతో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం అతలాకుతలమైంది. భవనాలు ఊగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రకంపనలు సంభవించిన సమయంలో ఆపరేషన్ థియేటర్ ఊగిపోతున్నప్పటికీ, ఓ ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను పూర్తి చేసిన ఘటన కమ్చట్కా ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలను రష్యన్ న్యూస్ నెట్‌వర్క్ 'ఆర్టీ' సామాజిక మాధ్యమంలో పంచుకుంది. ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. ప్రకంపనల ధాటికి భవనం మొత్తం ఊగిపోయింది. అయినప్పటికీ, వైద్యులు మాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉండి శస్త్రచికిత్సను పూర్తి చేశారు.

ప్రకంపనలు సంభవించినప్పుడు ఆపరేషన్ థియేటర్‌లోని స్ట్రెచర్‌ను సిబ్బంది గట్టిగా పట్టుకోగా, వైద్యులు శస్త్రచికిత్సను పూర్తి చేశారు. భూకంపం సంభవించిన సమయంలోనూ వైద్యులు శస్త్రచికిత్స చేయడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, రోగి కోలుకుంటున్నాడని రష్యన్ ఆరోగ్య శాఖ ప్రకటించిందని ఆర్టీ న్యూస్ ఛానల్ తెలిపింది.


More Telugu News