ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత మాకు చెప్పలేదు: లోక్ సభ వేదికగా మోదీ ప్రకటన

  • కాంగ్రెస్ పార్టీపై నరేంద్ర మోదీ ఆగ్రహం
  • కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని స్పష్టీకరణ
  • పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు చెప్పానన్న మోదీ
  • ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం శోచనీయమన్న మోదీ
లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా 'ఆపరేషన్ సిందూర్' కొనసాగుతుందని, దుశ్చర్యలకు తెగబడితే దీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామని ఆయన వెల్లడించారు. 'ఆపరేషన్ మహదేవ్' చేపట్టి ఉగ్రవాదులను ఏరివేస్తున్నట్లు చెప్పారు. 'ఆపరేషన్ సిందూర్'పై లోక్‌సభలో చర్చకు సమాధానంగా మోదీ ప్రసంగించారు.

కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను ప్రధానమంత్రి తోసిపుచ్చారు. ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' ఆపాలని ప్రపంచంలో ఏ నేత మనకు చెప్పలేదని ఆయన అన్నారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో ఫోన్‌లో మాట్లాడారని, పాక్ భారీ దాడి చేయబోతోందని హెచ్చరించారని వెల్లడించారు.

అలా జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు స్పష్టం చేశానని అన్నారు. పాకిస్థాన్‌కు ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పామని అన్నారు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెబుతామని చెప్పానని, చెప్పినట్లుగానే పాక్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సమాధానం ఇచ్చామని ప్రధానమంత్రి అన్నారు. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి 'ఆపరేషన్ సిందూర్' ఆపాలని కోరితేనే నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గామ్ దాడి చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత మన సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు 'ఆపరేషన్ సిందూర్‌'ను సమర్థించాయని, పాకిస్థాన్ వైపు మూడు దేశాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

'ఆపరేషన్ సిందూర్‌'ను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడం శోచనీయమని ప్రధానమంత్రి అన్నారు. మీడియా హెడ్‌లైన్‌లలో వచ్చేందుకు కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మీడియా హెడ్‌లైన్‌లలో ఉంటారేమో కానీ ప్రజల మనసుల్లో ఉండలేరని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్ వెనుకేసుకు రావడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు. పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కినప్పుడు కూడా కాంగ్రెస్ ఇలాగే మాట్లాడిందని, కానీ ఆయనను సురక్షితంగా తీసుకువచ్చామని గుర్తు చేశారు. భారత సైనిక శక్తిపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News