పిల్లలను హత్య చేసిన తల్లి, ప్రియుడికి మరణించే వరకు జీవిత ఖైదు

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని పిల్లల హత్య
  • పాలలో మత్తు మాత్రలు కలిపి పిల్లలను హత్యచేసిన తల్లీ, ప్రియుడు
  • కాంచీపురం జిల్లాలోని మూడ్రాంకట్టలైలో ఘటన
  • నిందితులను దోషులుగా తేల్చి శిక్ష విధించిన కోర్టు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి తమ ఇద్దరు పిల్లలను చంపిన కేసులో తల్లి అభిరామి మరియు ఆమె ప్రియుడు మీనాక్షిసుందరంలకు కాంచీపురం మహిళా కోర్టు జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు ఈ శిక్ష కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

కాంచీపురం జిల్లాలోని మూడ్రాంకట్టలై ప్రాంతానికి చెందిన విజయ్, అభిరామి దంపతులకు ఏడేళ్ల అజయ్, నాలుగేళ్ల కర్ణిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగం చేసేవాడు. అభిరామికి స్థానిక బిర్యానీ హోటల్ యజమాని మీనాక్షిసుందరంతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ సంబంధానికి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని భావించిన అభిరామి, 2018లో మీనాక్షిసుందరంతో కలిసి పిల్లలను చంపాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం, వారికి పాలలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి హతమార్చారు. ఈ దారుణ ఘటన అప్పట్లో తమిళనాడులో పెను సంచలనం సృష్టించింది.

ఈ కేసులో చెన్నై కోయంబేడు పోలీసులు అభిరామి, మీనాక్షిసుందరంలను అరెస్టు చేశారు. మొదట చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిపి, ఆ తర్వాత కాంచీపురం కోర్టుకు బదిలీ చేశారు. గురువారం ఈ కేసు విచారణ పూర్తవగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ మరణం వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.


More Telugu News