టాటా స‌న్స్ ఛైర్మన్ చంద్ర‌శేఖ‌ర‌న్‌కు భారీగా పెరిగిన వేత‌నం

  • 2024-25 ఆర్థిక‌ సంవ‌త్సరంలో రూ. 155.81 కోట్ల జీతం అందుకున్న చంద్ర‌శేఖ‌ర‌న్‌
  • గ‌తేడాదితో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరుగుద‌ల‌
  • అంత‌కుముందు ఏడాది చంద్ర‌శేఖ‌ర‌న్‌కు రూ. 135 కోట్ల వేత‌నం
టాటా స‌న్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ 2024-25 ఆర్థిక‌ సంవ‌త్సరంలో రూ. 155.81 కోట్ల జీతం అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక‌ సంవ‌త్స‌రానికి చంద్ర‌శేఖ‌ర‌న్ వేతనంగా రూ. 135 కోట్లు అందుకున్నారు. కంపెనీ వార్షిక రిపోర్టు ద్వారా ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2025 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆయ‌న వేత‌నం రూపంలో రూ. 15.1 కోట్లు, ఇత‌ర క‌మీష‌న్‌, లాభాల్లో భాగంగా రూ. 140.7 కోట్లు ఆర్జించారు. 

ఇక‌, టాటా స‌న్స్‌లో చేస్తున్న ఇత‌ర ఉద్యోగుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ సౌర‌భ్ అగ‌ర్వాల్ 2025 వార్షిక సంవ‌త్స‌రంలో రూ. 32.7 కోట్లు జీతంగా పొందారు. గ‌తేడాదితో పోలిస్తే ఇది 7.7 శాతం అధికం. ర‌త‌న్ టాటా మృతి త‌ర్వాత టాటా స‌న్స్‌లో చేరిన నోయ‌ల్ టాటాకు రూ. 1.42 కోట్ల క‌మీష‌న్ వ‌చ్చింది. 

2025 మార్చిలో రిటైర్ అయిన మాజీ బోర్డు స‌భ్యుడు లియో పురికి రూ. 3.13 కోట్ల క‌మీష‌న్ వ‌చ్చింది. అలాగే, 2024 ఆగ‌స్టులో రిటైర్ అయిన భాస్క‌ర్ భ‌ట్ రూ. 1.33 కోట్ల క‌మీష‌న్ అందుకున్నారు. అయితే, వాస్తవానికి గ‌త వార్షిక సంవ‌త్స‌రంలో టాటా స‌న్స్ కంపెనీ త‌న లాభాల్లో 24.3 శాతం కోల్పోయింది. కానీ, అలాంటి స‌మ‌యంలో టాటా స‌న్స్ ఛైర్మ‌న్‌కు జీతాన్ని పెంచ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తేడాది టాటా స‌న్స్ లాభాలు రూ. 34,654 కోట్ల నుంచి రూ.26,232 కోట్ల‌కు ప‌డిపోయాయి.




More Telugu News