టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా

  • ఇటీవ‌ల అశోక్ గ‌జ‌ప‌తిరాజు గోవా గవర్నర్‌గా నియామ‌కం
  • టీడీపీ ప్రాథమిక సభ్యతం, పొలిట్ బ్యూరోకు, జీవితకాల సభ్యత్వంకు రాజీనామా
  • దివంగత సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో కొన‌సాగిన సీనియ‌ర్ నేత‌
  • విజ‌య‌న‌గ‌రం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎంపీగా విజయం
  • కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు
టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆయ‌న‌ను గోవా గవర్నర్‌గా నియమించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పొలిట్ బ్యూరోకు, జీవితకాల సభ్యత్వంకు రాజీనామా చేశారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
 
టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తనకు గోవా గవర్నర్‌గా అవకాశం కల్పించిన నేపథ్యంలో పార్టీకి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయ‌న‌ టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు పంపించారు.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎంపీగా విజయం
అశోక్‌ గజపతి రాజు టీడీపీలో సీనియర్ నేత. విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఒకసారి గెలుపొందారు. అశోక్ గజపతి రాజు తన తండ్రి పీవీజీ రాజు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అశోక్ గజపతి రాజు తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు. 

1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్‌ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.

కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు
2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అశోక్‌ గజపతి రాజు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాణ శాఖ మంత్రిగా చేశారు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేవరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు బరిలోకి దిగి ఓడిపోయారు. అయితే, 2024 ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలో దిగిన అదితి గజపతిరాజు విజయం సాధించారు. 



More Telugu News