హరీశ్ ఆరడుగులు పెరిగాడే కానీ... మెదడు అర అంగుళం కూడా పెంచుకోలేదు: టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్

  • గోదావరిలో 3 వేల టీఎంసీల వరదను ఏపీ వినియోగించుకోవచ్చని కేసీఆర్ చెప్పారన్న మహేశ్ కుమార్
  • రాయలసీమను రతనాలసీమ చేస్తానని కేసీఆర్ అన్నారని వ్యాఖ్య
  • కేసీఆర్ వల్లే వాళ్లు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల కడుతున్నారన్న మహేశ్
  • హరీశ్ రావు పిచ్చి వాగుడు వాగుతున్నాడని మండిపాటు
  • ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం మాట్లాడారో సీఆర్ పాటిల్ స్వయంగా చెప్పారన్న మహేశ్
రాయలసీమను రతనాలసీమ చేస్తాను... బేసిన్లు లేవు, సరిహద్దులు లేవు అని ఆనాడు కేసీఆర్ అనడం వల్లే... ఇవాళ వాళ్లు (ఏపీ) బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రతి ఏటా గోదావరిలో 3 వేల టీఎంసీల వరద ఉంటుందని... ఈ నీటి ఏపీ వాడుకోవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరు అడుగులు పెరిగాడే కానీ.... అర అంగుళం మెదడు కూడా పెంచుకోలేదని ఎద్దేవా చేశారు. అర్థపర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటుకోవాలనుకుంటున్నారని విమర్శించారు.

నీటి పారుదల అంశాలపై నిన్న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సమావేశమయ్యారని... ఏ అంశాలపై చర్చ జరిగిందో స్వయంగా సీఆర్ పాటిల్ చెప్పినప్పటికీ హరీశ్ రావు పిచ్చి వాగుడు వాగుతున్నారని మహేశ్ కుమార్ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏయే అంశాలపై మాట్లాడారో వివరంగా చెప్పారని... ఇవేవీ హరీశ్ రావు మెదడుకు ఎక్కినట్టు లేవని అన్నారు. 

తెలంగాణకు అడ్డగోలుగా ద్రోహం చేసిన మీరే ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ మీద, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు రావాలని సవాల్ విసిరారు. నువ్వు, మీ మామ కేసీఆర్ వచ్చి మీ వాదనలు వినిపించాలని అన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే ప్రజలు నమ్మరని చెప్పారు.


More Telugu News