ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్ తో చర్చ
  • కేంద్రం నుంచి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన నిర్మలా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కేంద్రం నుంచి అదనపు నిధుల కోసం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఆర్థిక నష్టాలను 16వ ఆర్థిక సంఘం దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మరింత మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీలో రాయలసీమ ప్రాంతాన్ని కరవు నుంచి కాపాడేందుకు కేంద్రం మద్దతు అందించాలని కూడా చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.


ఈ సమావేశంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.


More Telugu News