వచ్చే నెలలో ప్రధాని మోదీ చైనా టూర్!

  • షాంఘై కో ఆపరేషన్ సదస్సులో పాల్గొంటారన్న అధికారులు
  • చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో భేటీ కానున్న మోదీ
  • సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి చైనా పర్యటన!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. చైనాలోని తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు (ఎస్ సీవో) జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని అధికారవర్గాల సమాచారం. ఇందుకోసం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మోదీ చైనాకు వెళతారని తెలిపాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా - భారత సైనికుల మధ్య ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తియాంజిన్ సిటీలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 తేదీ వరకు ఎస్ సీవో సమిట్ జరగనుంది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ తరఫున ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తదితరులు పాల్గొంటారు. ఈ సదస్సు సందర్భంగా జిన్ పింగ్ తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందులో పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు సరిహద్దు సమస్యలపైనా చర్చ జరగనుందని తెలుస్తోంది. 

తొలిసారిగా 2015లో ప్రధాని హోదాలో మోదీ తొలిసారి బీజింగ్‌ లో పర్యటించారు. ఆ తర్వాత కాలంలో ఇప్పటి వరకు మోదీ మొత్తం ఐదుసార్లు చైనాకు వెళ్లారు. 2020లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువైపులా సైనికులు చనిపోయారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి ప్రధాని మోదీ చైనాలో పర్యటించలేదు. తాజాగా భారత్ చైనాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బీజింగ్ కు వెళ్లారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాల గురించి చర్చించారు.


More Telugu News