లార్డ్స్ టెస్టులో టీమిండియాకు తీవ్ర నిరాశ... ఇంగ్లండ్ జట్టుదే గెలుపు

  • భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు 
  • లండన్ లోని లార్డ్స్ మైదానంలో మ్యాచ్
  • 22 పరుగుల తేడాతో నెగ్గిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 
  • జడేజా ఒంటరిపోరాటం వృథా
చారిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్‌ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాయి. అయితే, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లను త్వరగా కోల్పోవడంతో విజయం చేజారింది. జడేజా ఒంటరిపోరాటం వృథా అయింది.

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 170 పరుగులకే ఆలౌట్‌ అయింది. జడేజా (61 నాటౌట్‌) ఒక్కడే పోరాడాడు. కేఎల్‌ రాహుల్‌ (39) ఓ మోస్తరుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడం. యశస్వి జైస్వాల్‌ (0), శుబ్‌మన్‌ గిల్‌ (6) విఫలమవడం భారత్‌ను దెబ్బతీసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, స్టోక్స్‌ మూడేసి వికెట్లు తీశారు. ఈ ఓటమితో భారత జట్టు సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. బౌలర్లు బుమ్రా, సుందర్‌లు గట్టి పోటీ ఇచ్చినా, బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను చాటుచేసింది. తదుపరి మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 387 పరుగులు చేసింది. భారత్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులతో సమం చేసింది. ఇక, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 192 పరుగులకు ముగిసింది. దాంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నిలిచింది. కానీ బ్యాట్స్ మెన్ వైఫల్యంతో టీమిండియాకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇక, ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరగనుంది.


More Telugu News