గ్లామరస్ హీరోయిన్స్ ను మాయం చేస్తున్న ఫ్లాప్!
- రాకెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన శ్రీలీల
- ఫస్టు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి
- ఎంట్రీ తోనే యూత్ ను ఊపేసిన వైష్ణవీ
- ఫ్లాప్ ల కారణంగా తగ్గిన జోరు
వెండితెరపై కనిపించేవారికి .. ఆ తెర వెనక పనిచేసేవారికి నిద్రపట్టనీయని ఒకే ఒక్క మాట ఫ్లాప్. అది కంగారు పెడుతుంది .. కలవరపెడుతుంది .. కల్లోలానికి గురిచేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే భవిష్యత్తును తలచుకుని భయపడేలా చేస్తుంది. నష్టాలు తెచ్చేది .. కష్టాలు పెట్టేది ఈ ఫ్లాప్. దీనికి విరుగుడు సక్సెస్ మాత్రమే. అందువల్లనే అంతా ఇక్కడ దాని వెంటపడుతూ ఉంటారు. అయితే అది అంత తేలికగా దొరికేరకం కాదు. దాని దాగుడుమూతలు అది ఆడుతూ ఉంటుంది. సినిమాకి సంబంధించిన ప్రయాణం మొదలెట్టినవారిలో ఫ్లాప్ కి దొరకకుండా పోయినవారు లేరు. దాని చేతికి చిక్కి .. చిక్కిపోనివారూ లేరు. హీరోయిన్స్ చాలా గ్లామరస్ గా ఉంటారు గదా .. వాళ్లనైనా వదిలేద్దామనే కనికరం కూడా ఫ్లాప్ కి లేకపోవడం నిజంగా విడ్డూరమే. వరుస సక్సెస్ లతో లేడి పిల్లల మాదిరిగా గెంతులు వేస్తూ వెళుతున్న హీరోయిన్స్ పై ఫ్లాప్ అమాంతంగా వచ్చి పడుతూ ఉంటుంది. వాళ్ల ఊహలపై ఉప్పునీళ్లు చల్లేస్తూ ఉంటుంది. అందుకే హీరోయిన్స్ ఎక్కువగా బెదిరిపోతూ ఉంటారు. శ్రీలీల కెరియర్ రాకెట్ లా దూసుకుపోతుంటే మధ్యలోకి తోసుకొచ్చింది ఈ ఫ్లాపే. పాలరాతి శిల్పం మాదిరిగా కనిపించే కృతి శెట్టి స్పీడ్ కి బ్రేక్ వేసింది ఈ ఫ్లాపే. ఇక ఫస్టు హిట్ ను పూర్తిగా ఎంజాయ్ చేయకముందే వైష్ణవీ చైతన్యను టెన్షన్ పెట్టేసింది కూడా జాలిలేని ఫ్లాపే. ఈ ముగ్గురు భామలు ఫస్టు మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నవారు, నటనలోను .. డాన్సులలోను దుమ్మురేపేసిన వారు. మరి అలాంటి వారి పరిస్థితే ఇలా ఉందంటే ఏమనుకోవాలి. సినిమా ఫ్లాప్ లో హీరోయిన్స్ బాధ్యత దాదాపుగా ఉండదు. ఒకవేళ ఏ కొంచెమో ఉన్నా, అది వాళ్లను వేరే ఇండస్ట్రీకి పారిపోయేలా చేయకూడదేమో.