5 వేలకే స్మార్ట్‌ఫోన్.. భారత మార్కెట్లోకి ఏఐ+ ఎంట్రీ

  • రియల్‌మీ మాజీ సీఈఓ మాధవ్‌ సేథ్‌ కొత్త బ్రాండ్
  • అత్యంత చౌకగా 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు
  • ఆకట్టుకుంటున్న ఏఐ+ ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే!
  • జులై 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో కొత్త దేశీయ బ్రాండ్ అడుగుపెట్టింది. అత్యంత తక్కువ ధరలకే 4జీ, 5జీ ఫోన్లను అందిస్తూ పోటీకి సిద్ధమైంది. రియల్‌ మీ ఇండియా, హానర్‌ సంస్థల మాజీ సీఈఓ మాధవ్‌ సేథ్‌ 'నెక్ట్స్‌ క్వాంటమ్‌ షిఫ్ట్‌ టెక్నాలజీస్‌' పేరుతో కొత్త కంపెనీని ప్రారంభించి, 'ఏఐ+' బ్రాండ్ కింద రెండు స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేశారు.

ఏఐ+ పల్స్‌ (4జీ), ఏఐ+ నోవా (5జీ) పేర్లతో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వీటి ధరలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఏఐ+ పల్స్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.4,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.6,999గా ఉంది. ఇక ఏఐ+ నోవా 5జీ ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.7,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.9,999కే లభించనుంది. భారతీయుల కోసం ప్రత్యేకంగా డిజైన్, వేగం, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాధవ్ సేథ్ తెలిపారు. ఈ నెల 12 నుంచి పల్స్ మోడల్, 13 నుంచి నోవా 5జీ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నాయి. బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌, పింక్‌, పర్పుల్‌ రంగుల్లో ఇవి లభిస్తాయి.
 
ఫీచర్ల విషయానికొస్తే..
  • 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
  • 50 ఎంపీ ప్రధాన కెమెరా
  • 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్
  • పల్స్ మోడల్‌లో యూనిసోక్ టీ615, నోవా 5జీలో యూనిసోక్ టీ8200 ప్రాసెసర్‌ ను ఉపయోగించారు.
  • ఈ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఎన్‌ఎక్స్‌ టీక్యూ ఓఎస్‌ తో పనిచేస్తాయి.


More Telugu News