మద్యం మత్తులో యువతి హల్ చల్

  • మద్యం మత్తులో తన ఫ్లాట్ వద్ద ఓ యువతి అర్ధరాత్రి తర్వాత హాల్ చల్
  • పక్కింటి ఫ్లాట్‌లో మహిళతో వాగ్వివాదం 
  • పోలీసులపైనా దుర్భాషలు
  • అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
  • బంజారాహిల్స్‌లో ఘటన
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని శ్రీరాంనగర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. శ్రీరాంనగర్‌లో నివాసం ఉండే అలిస్ జోసెఫ్ (26) అనే యువతి గతంలో ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ప్రస్తుతం ఆమె వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అలిస్ జోసెఫ్ తన పక్కింటి ఫ్లాట్ తలుపు తట్టింది. అక్కడ నివాసం ఉంటున్న బెంగాల్‌కు చెందిన నేహా థాపా బయటకు రాగా, ఆమెతో అలిస్ గొడవకు దిగింది.

దాదాపు అరగంట పాటు మద్యం మత్తులో ఆమె హంగామా చేయడంతో పాటు డయల్ 100కు ఫోన్ చేసి తన పక్కింటి ఫ్లాట్‌లో గంజాయి అమ్ముతున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నేహా ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. అయితే నేహా నివాసంలో గంజాయి ఆనవాళ్లు ఏమీ లభించలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అలిస్ జోసెఫ్ పోలీసులపై దుర్భాషలాడింది.

పోలీసులు అక్కడే ఉండగా, ఆమె తన ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని గ్యాస్ ఓపెన్ చేసి నిప్పు వెలిగించింది. దీంతో కిచెన్‌లో మంటలు చెలరేగాయి. బయట ఉన్న పోలీసులు, ఇంటి యజమాని, స్థానికులు కలిసి అలిస్ జోసెఫ్ ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి మంటలను అదుపు చేశారు.

నిందితురాలు అలిస్ జోసెఫ్‌కు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా, ఆమె మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ ఘటనపై నేహా థాపా ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద అలిస్ జోసెఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 


More Telugu News