రైలు పట్టాలపై కారు నడిపి యువతి హల్‌చల్‌.. ఇదిగో వీడియో!

  • రీల్స్ కోసం రైలు పట్టాలపై కారు నడిపిన యువతి
  • రంగారెడ్డి జిల్లా నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో ఘటన
  • అడ్డుకున్న స్థానికులను చాకుతో బెదిరించిన వైనం
  • గంటల తరబడి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ మోజులో ఏకంగా రైలు పట్టాలపైనే కారు నడిపి తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి-శంకర్‌పల్లి రైల్వే మార్గంలో ఓ యువతి తన కారును రైలు పట్టాలపై నడుపుతూ కనిపించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు రీల్స్ చిత్రీకరించేందుకే ఆమె ఈ ప్రమాదకరమైన పనికి పాల్పడినట్లు తెలిసింది. రైలు పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న కారును గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, యువతి వారిని ఏమాత్రం లెక్కచేయకుండా కారును ముందుకు పోనిచ్చింది.

కొంత దూరం వెళ్లాక, నాగులపల్లి వద్ద కొందరు స్థానికులు ఆమె కారును అడ్డుకోగలిగారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి తన వద్ద ఉన్న చాకును తీసి వారిని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె మద్యం మత్తులో ఉండి ఈ చర్యకు పాల్పడిందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన కారణంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న పలు రైళ్లను అధికారులు మార్గమధ్యంలోనే నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యువతిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Your browser does not support HTML5 video.

Your browser does not support HTML5 video.


More Telugu News