: సౌరవిద్యుత్తు సేకరణ దిశగా ప్రయత్నాలు


అంతరిక్షంలో మనకు అనంతమైన శక్తినిచ్చే తరగని శక్తి వనరు సూర్యుడు. ఈ సౌరవిద్యుత్తును అంతరిక్షం నుండి సేకరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి అమెరికా, భారతదేశాలు. ఇందుకోసం ఈ రెండు దేశాలు సంయుక్తంగా కలిసి ముందుకు సాగనున్నాయి. అంతరిక్షం నుండి సౌరవిద్యుత్తును సేకరించేందుకుగాను భారతదేశం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ 'నేషనల్‌ స్పేస్‌ సొసౌటీ’ (ఎన్‌ఎస్‌ఎస్‌)'తో కలిసి ముందుకు సాగేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకుగానూ రెండు దేశాలూ కలిసి ఒక అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాయి. భవిష్యత్తులో మానవాళి ఇంధనావసరాలను తీర్చడంతోబాటు వాతావరణ మార్పులను నివారించే దిశగా ఈ సంస్థ కృషి చేస్తుందని భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం, ఎన్‌ఎస్‌ఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ మార్క్‌ హాప్కిన్స్‌ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 'అంతర్జాతీయ రోదసి అభివృద్ధి సదస్సు (ఐఎస్‌డీసీ 2013)'లో కలాం ముందుగా తాను ప్రతిపాదించిన 'గ్లోబల్‌ స్పేస్‌ సోలార్‌ ప్లాన్‌'ను ఆవిష్కరించారు. ఈ నూతన ప్రణాళిక గురించి సదస్సులో వివరించారు.

అయితే అంతరిక్షం నుండి సౌరవిద్యుత్తును ఒడిసిపట్టేందుకు కావలసిన టెక్నాలజీని అంతర్జాతీయ సహకారం ద్వారా అభివృద్ధి చేయడం ప్రస్తుత తక్షణావసరం. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరంగా భూమి ప్రమాదంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భూమిని రోదసి నుండి సౌరవిద్యుదుత్పత్తే కాపాడగలదు అని కలాం, హాప్కిన్స్‌లు ప్రకటించారు. ఏడాదిలోగా జీ8 లేదా జీ20 దేశాలకు అంతరిక్ష సౌరవిద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్టు వారు తెలిపారు. భారత్‌, అమెరికా, జపాన్‌, బ్రిటన్‌లతోబాటు రోదసి సౌరవిద్యుత్తు కల సాకారం కోసం కృషి చేస్తున్న ఇతర దేశాల సభ్యత్వంతో ఒక బృందంగా కలిసి ముందుకు సాగనున్నట్టు వారు తెలిపారు. సమష్టి కృషితోనే గ్లోబల్‌ స్పేస్‌ నాలెడ్జి ఫ్లాట్‌ఫాం, ఇంటర్నేషనల్‌ వర్చువల్‌ ల్యాబొరేటరీ, అంతర్జాతీయ సలహా కమిటీ వంటి యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ దేశాల సహకారంతో చేపట్టే ఈ కార్యక్రమం భవిష్యత్‌ కాలంలో భూగోళం సుసంపన్నతకు, దేశాలమధ్య శాంతియుత సంబంధాలకు ప్రేరణగా నిలుస్తుందని అబ్దుల్‌ కలాం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News