అణ్వాయుధాలు మా లక్ష్యం కాదు.. కానీ: ఇరాన్ అధ్యక్షుడు

  • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
  • అణ్వాయుధాల తయారీ తమ ఉద్దేశం కాదన్న ఇరాన్ అధ్యక్షుడు
  • శాంతియుత అణు కార్యక్రమ హక్కులను కాపాడుకుంటామని వెల్లడి
  • సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమన్న పెజిష్కియాన్
పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో శాంతియుత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌ పెజిష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను తయారుచేయాలన్నది తమ దేశ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించుకునే తమ చట్టబద్ధమైన హక్కులను మాత్రం కాపాడుకుంటామని ఆయన వెల్ల‌డించారు.

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన అనంతరం, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్ జాయెద్‌ అల్ నహ్యాన్‌తో ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పెజిష్కియాన్‌ మాట్లాడుతూ, "ఇరాన్‌ తన చట్టబద్ధమైన హక్కులకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మా దేశం ఎప్పుడూ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని ప్రయత్నించలేదు. అలాంటి కోరిక కూడా మాకు లేదు. ఇరాన్‌ ఎలాంటి సంఘర్షణలను కోరుకోవడం లేదు. అయితే, మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని అన్నట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది.

గత 12 రోజులుగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిన్న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్‌ మీడియా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం ఒప్పందం కుదిరిన విషయాన్ని అంగీకరించారు. ఈ ఒప్పందంతో ప్రస్తుతానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారినట్లయింది.


More Telugu News