: అద్వానీ రాజీనామా ఉపసంహరించుకున్నారా.. ఏమో!


అద్వానీ రాజీనామా ఉపసంహరించుకున్నారా? కొత్త నాయకత్వం బీజేపీలో శిఖర సమానుడైన అద్వానీని ఒప్పించడంలో సఫలం కాగలిగారా? అసలు అద్వానీ రాజీనామా ఉపసంహరించుకుంటే మీడియా సమావేశానికి ఎందుకు రాలేదు? ఇవన్నీ బీజేపీ కార్యకర్తలకు సమాధానం దొరకని ప్రశ్నలే. సుధీర్ఘ చర్చల అనంతరం బీజేపీ నాయకత్వం ఆఘమేఘాలమీద మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అద్వానీ సూచించిన అంశాలమీద సమగ్రంగా చర్చించామని, పార్లమెంటరీ బోర్డు చేసిన విజ్ఞప్తిని అద్వానీ ఆమోదిస్తానన్నారని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పనిలో పనిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అద్వానీతో మాట్లాడారని కూడా అన్నారు. పార్టీకి అద్వానీ మార్గదర్శనం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇక్కడే బీజేపీ కార్యకర్తలకు అనుమానం కలుగుతోంది. అలకబూనిన అద్వానీ అంత త్వరగా మెత్తబడ్డారా? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఒక వేళ మెత్తబడితే విలేకరుల సమావేశం అద్వానీ ఎందుకు పెట్టలేదు? పోనీ కనీసం ఒక లేఖ ఐనా ఎందుకు విడుదల చేయలేదు? అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ దశ, దిశలమీద లేఖలో విమర్శలు గుప్పించిన అద్వానీకి పార్టీ పెద్దలు ఏ విధమైన హామీ ఇచ్చారు? ఇస్తే దాన్ని మోడీ అనుసరిస్తారా? అన్నదే తాజా వివాదంలో ఆసక్తి రేపుతున్న అంశం. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అద్వానీని ఒప్పించారని చెబుతున్నారు పార్టీ పెద్దలు. అసలు ఆర్ఎస్ఎస్ చెబితే అద్వానీ వింటారా? అద్వానీ సమస్యల్లో ఆర్ఎస్ఎస్ కూడా ఒకటని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ చెబితే వినే పరిస్థితి ఉందా?. ఏమో ఎవరికి తెలుసు?

ఇప్పటికి అద్వానీ రాజీనామా ఉపసంహరించుకుంటే ప్రెస్ మీట్ లో ముక్తసరిగా నేతలు ఎందుకు సమాధానాలు చెప్పి ముగించారంటూ విలేకరులు గుసగుసలాడుతున్నారు. అసలు అద్వానీ మోడీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అన్న దానికి పార్టీ అధిష్ఠానం దగ్గర సమాధానం ఉందా? రెండోది, అద్వానీ ప్రధాని పదవిని ఆశిస్తున్నారా? అన్నది కార్యకర్తలకున్న ఇంకో డౌటు. ఇదంతా ఒకెత్తయితే అద్వానీ సమస్యలని విన్న అధిష్ఠానం వాటన్నింటినీ క్లియర్ చేస్తుందా? విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టు అద్వానీని ఏమన్నా ఓ వర్గానికి కోపం ముంచుకొస్తుంది. అలాగని మోడీని తగ్గమంటే మరికొంతమందికి నషాళానికంటుతుంది. ఇంతకీ, పార్టీ పెద్దలు ఎవర్ని ఒప్పించారు? మరెవర్ని బుజ్జగిస్తారు? అన్న లోగుట్టు పెరుమాళ్లుకెరుక.

  • Loading...

More Telugu News