మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనల్స్‌కు తెలుగు యువతి సంజన వరద

  • ఆంధ్రప్రదేశ్‌లోని తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరికి చెందిన సంజ‌న‌
  • బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థిని
  • గతేడాది మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2024 విజేత
  • నటన, మోడలింగ్‌తో పాటు చదువులోనూ ప్రతిభ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి సంజన వరద అందాల పోటీల్లో సత్తా చాటుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలకు ఆమె ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న సంజన, అతి చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. 

సంజన ఏపీలోని తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరిలో జన్మించారు. బెంగళూరులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం అక్కడే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. చదువుతో పాటు మోడలింగ్ రంగంలోనూ రాణిస్తున్నారు. 2024లో జరిగిన మిస్ టీన్ గ్లోబ్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ త‌ర్వాత 2024లోనే మిస్ టీన్ గ్లోబ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ పోటీల్లో పాల్గొని, ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు.

ఒకే సమయంలో పలు రంగాల్లో రాణించడం సంజన ప్రతిభకు నిదర్శనం. మోడలింగ్, అందాల పోటీలతో పాటు ఆమె నటనలోనూ అడుగులు వేస్తూ, మరోవైపు తన ఇంజినీరింగ్ చదువును కొనసాగిస్తున్నారు.

మిస్ గ్రాండ్ ఇండియా పోటీలు దేశంలోని ముఖ్యమైన అందాల పోటీలలో ఒకటిగా పరిగణిస్తారు. యువతులు తమ అందంతో పాటు తెలివితేటలు, ప్రతిభ, సామాజిక సేవా దృక్పథాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి వేదిక. ఫైనలిస్ట్‌గా ఎంపికైన సంజన, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రతిభావంతులైన యువతులతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక కిరీటం కోసం పోటీపడనున్నారు.

2024లో మిస్ టీన్ గ్లోబ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న సంజన, ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనల్స్‌కు చేరడం భారతీయ అందాల పోటీల రంగంలో ఆమె ఎదుగుదలను సూచిస్తోంది. ఈ పోటీల తుది దశకు సంజన సిద్ధమవుతున్న తరుణంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మిస్ గ్రాండ్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు జరుగుతుందనే తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News