జమ్ముకశ్మీర్‌లో ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

  • జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం
  • ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై చర్యలు
  • బాధితుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్, టీచర్, జూనియర్ అసిస్టెంట్
  • లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉత్తర్వులు జారీ
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ప్రభుత్వ ఉద్యోగులపై యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. లష్కరే ​తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

తొలగించిన వారిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మాలిక్‌ ఇష్ఫాక్‌ నసీర్‌, పాఠశాల ఉపాధ్యాయుడు అజాజ్‌ అహ్మద్‌, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వసీం అహ్మద్‌ ఖాన్‌ ఉన్నారు. ఈ ముగ్గురూ ఉగ్రవాద సంస్థలకు సరుకులు చేరవేయడం, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడటం, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉగ్రవాదుల సానుభూతిపరులను గుర్తించి, వారిని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యవర్గం సుమారు 75 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు గుర్తించి వారిని విధుల నుంచి తొలగించింది. క్షేత్రస్థాయిలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోంది.

2007లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన మాలిక్‌ ఇష్ఫాక్‌ నసీర్‌, పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన లష్కరే ఉగ్రవాది అయిన తన సోదరుడు మాలిక్‌ ఆసిఫ్‌కు చేదోడువాదోడుగా ఉన్నట్లు తేలింది. 2018లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఆసిఫ్ మృతి చెందాడు. అయినప్పటికీ ఇష్ఫాక్‌ తన ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించాడు. ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను చేరవేయాల్సిన ప్రదేశాలను గుర్తించి, వాటి జీపీఎస్‌ కోఆర్డినేట్లను పాకిస్థాన్‌లోని ఉగ్ర హ్యాండ్లర్లకు పంపేవాడని ఆరోపణలున్నాయి. అక్కడకు చేరిన ఆయుధాలను గుర్తించి, వాటిని జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు చేరవేసేవాడని 2021లో పోలీసులు గుర్తించారు.

మరోవైపు, 2011లో విద్యాశాఖలో టీచర్‌గా చేరిన అజాజ్‌ అహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ సంస్థకు ఆయుధాలు, ప్రచార సామగ్రిని అక్రమంగా రవాణా చేసేవాడని తేలింది. 2023లో పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అతడు, అతడి స్నేహితుడు పట్టుబడ్డారు. పీఓకేలోని హిజ్బుల్‌ ఆపరేటివ్‌ అబిద్‌ రంజాన్‌ షేక్‌ నుంచి అతడికి ఆయుధాలు అందినట్లు అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, కశ్మీర్‌లోని పూంచ్‌ ప్రాంతంలో హిజ్బుల్‌కు నమ్మకమైన కార్యకర్తగా మారాడు.

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వసీం అహ్మద్‌ ఖాన్‌ లష్కరే, హిజ్బుల్‌ రెండు సంస్థలకూ పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జమ్ముకశ్మీర్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్ట్‌ సుజాత్‌ బుఖారీ, ఆయన అంగరక్షకుడి హత్య కుట్రలో ఇతడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఘటనా స్థలం నుంచి తప్పించేందుకు వసీం సహకరించినట్లు తేలింది. 2018 ఆగస్టులో శ్రీనగర్‌లోని బట్‌మాలూ వద్ద జరిగిన ఉగ్రదాడిపై విచారణ సందర్భంగా ఇతడిని తొలిసారి అరెస్ట్‌ చేశారు.


More Telugu News