: వందల మంది లక్ష్మీనారాయణలను తయారు చేస్తా: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ
రిటైర్మెంట్ అనంతరం స్కూలు ప్రారంభించి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతానని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తను బదిలీపై వెళుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సొంతరాష్ట్రంలో ఏడేళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించడం వృత్తి పరంగా సంతృప్తినిచ్చిందన్నారు. దర్యాప్తు చేసిన ప్రతి కేసు వివరాలు సీబీఐ కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. జేడీ బాధ్యతలను వెంకటేష్ కు అప్పగించానని, వ్యక్తులు మారినా సీబీఐ వ్యవస్థలో, దర్యాప్తులో ఎలాంటి మార్పు ఉండదని లక్ష్మీనారాయణ తెలిపారు.
దర్యాప్తు సందర్భంగా తమపై ఎలాంటి ఒత్తిళ్లూ చోటుచేసుకోలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే దర్యాప్తు జరిగిందని స్పష్టం చేసారు. అవినీతి వల్ల దేశాభివృద్ధికి విఘాతం కలుగుతోందని, అందుకే అవినీతి నిర్మూలనకు చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అవినీతికి పాల్పడటమే కాదు, అవినీతిని ప్రోత్సహించడం కూడా నేరమేనని తెలిపారు.
భవిష్యత్తులో మంచి పాఠశాలను ఏర్పాటు చెయ్యడమే తన లక్ష్యమని, అందులో సంప్రదాయాలు, విలువలు, అత్యుత్తమ బోధనా పద్దతి నేర్పిస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు. అంతకంటే ముందు జాతీయ పోలీసు అకాడెమీలో పనిచేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అక్కడైతే మరింతమంది ఉత్తమ ఆఫీసర్లను తయారు చేసి దేశానికి అందించొచ్చనే ఆలోచనలో ఉన్నారు. అనంతరం అధికారులు, జర్నలిస్టులు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.