పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో.. వారికి ఉన్నత స్థానం దక్కుతుందనడానికి నేనే నిదర్శనం: పల్లా శ్రీనివాసరావు

  • క‌డ‌ప‌లో అంగ‌రంగ వైభ‌వంగా మ‌హానాడు
  • వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అద్భుత‌ ప్రసంగం
  • ఎన్టీఆర్‌ ఆశయాలు.. చంద్రబాబు విజన్‌తో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామ‌ని పిలుపు
  • విజనరీ నాయకుడి అడుగుజాడల్లో 2047 స్వర్ణాంధ్ర కోసం కృషి చేయాల‌ని వ్యాఖ్య
కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా మహానాడుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు ఆయ‌న ఘన స్వాగతం పలికారు. తాను మొదట కార్యకర్తగా మహానాడుకు వచ్చానని.. ఆ తరువాత గాజువాక ప్రజానీకం ఆశీర్వాదంతో గాజువాక ఎమ్మెల్యేగా.. నేడు రాష్ట్ర అధ్యక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ కుటుం సభ్యులతో పాల్గొనడం ఆనందంగా ఉంద‌న్నారు. 

ఈ అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబుకు ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అనుక్షణం భుజం తట్టి సహకారం అందిస్తున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక‌, పార్టీ రాష్ట్ర‌ అధ్యక్షుడిగా మహానాడులో మొదటి ప్రసంగం చేస్తుండడాన్న త‌న‌ జీవితంలో మరచిపోలేన‌ని తెలిపారు. ఇది త‌న‌కు ద‌క్కిన గౌరవం ఒక్కటే కాద‌ని.. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికి ఉన్నత స్థానం దక్కుతుందనడానికి తానే నిదర్శనమ‌ని పల్లా శ్రీనివాసరావు అన్నారు. కాగా, కడపలో మహానాడు పెడదామంటే ఎన్నో అపోహలు లేవనెత్తారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. కానీ, ఇక్కడికి వచ్చాక కడప ప్రజలు ఇచ్చిన సహ‌కారం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చిన తోడ్పాటు చాలా అద్భుతమ‌ని తెలిపారు. నందమూరి తార‌క రామారావు ఆశయాలు.. చంద్రబాబు విజన్ తో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 

నాడు విజన్ 2020 అంటే అందరూ నవ్వార‌ని... కానీ, 2020 వచ్చాక  చంద్రబాబు విజన్ అంటే ఏంటో ప్రజలకు అర్థ‌మైంద‌ని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 'వాట్ సీబీఎన్ థింక్ టుడే ది నేషన్ థింక్ టుమారో' అనే నినాదం మొదలైందన్నారు. అందరం విజనరీ నాయకుడి అడుగుజాడల్లో 2047 స్వర్ణాంధ్ర కోసం కృషి చేయాల‌న్నారు. టీడీపీకి అనుభవం ఉన్న నాయకత్వం చంద్రబాబు ద్వారా.. యువ నాయకత్వం లోకేశ్‌ ద్వారా వ‌చ్చాయ‌ని, కీర్తిశేషులు ఎన్‌టీఆర్‌ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఆచంద్రార్కం కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు అన్నారు.  


More Telugu News