హోరాహోరీ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి

రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్‌కు 10 పరుగుల తేడాతో విజయం
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 219/5
పంజాబ్ బ్యాటర్లు నెహాల్ వధేరా (70), శశాంక్ సింగ్ (59*) హాఫ్ సెంచరీలు
ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 209/7కే పరిమితం
ఐపీఎల్ లో ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాజస్థాన్ జట్టు పోరాడి ఓడింది. 220 పరుగుల లక్ష్యఛేదనలో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు చేసి ఓటమిపాలైంది. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మెరుపులు, ధ్రువ్ జురెల్ పోరాటం వృథా అయ్యాయి. పంజాబ్ బౌలర్లు కీలక సమయంలో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్‌ పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట్లో పంజాబ్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ప్రియాంశ్ ఆర్య (9), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21), మిచెల్ ఓవెన్ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వధేరా దూకుడుగా ఆడుతూ 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 59 పరుగులు సాధించాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (9 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు పడగొట్టగా, క్వెనా మఫాక, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా తనదైన శైలిలో ఆడుతూ 25 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 4.5 ఓవర్లలోనే 76 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే, పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ ఒకే ఓవర్లో ఇద్దరినీ పెవిలియన్ చేర్చి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (20), రియాన్ పరాగ్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

ఈ దశలో ధ్రువ్ జురెల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. షిమ్రాన్ హెట్‌మైర్ (11) నిరాశపరిచాడు. జురెల్ చివరి వరకు పోరాడినప్పటికీ, అవసరమైన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో రాజస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ కేవలం 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతనికి అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్ చెరో రెండు వికెట్లతో సహకరించారు. 


More Telugu News