టర్కీ కంపెనీలపై భారత్ కొరడా.. అదానీ ఒప్పందం రద్దు, మరో సంస్థకు అనుమతులు బంద్

  • టర్కీ సంస్థ డ్రాగన్‌పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఒప్పందం రద్దు
  • అదానీ విమానాశ్రయ లాంజ్‌లలో డ్రాగన్‌పాస్ కస్టమర్లకు ప్రవేశం నిలిపివేత
  • టర్కీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీకి భద్రతా అనుమతులు రద్దు చేసిన కేంద్రం
  • జాతీయ భద్రత దృష్ట్యానే ఈ చర్యలన్న పౌర విమానయాన శాఖ
  • పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు, ఎర్డోగాన్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరోపణలు
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు టర్కీ మద్దతిస్తున్న నేపథ్యంలో, ఆ దేశానికి చెందిన కంపెనీలపై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ ఓ టర్కీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోగా, కేంద్ర ప్రభుత్వం మరో టర్కీ సంస్థకు ఇచ్చిన భద్రతా అనుమతులను ఉపసంహరించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడులు, వాటికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌కు టర్కీ బాహాటంగా మద్దతు ప్రకటించడమే ఈ పరిణామాలకు కారణంగా తెలుస్తోంది.

విమానాశ్రయ లాంజ్‌ల సేవలకు సంబంధించి టర్కీకి చెందిన డ్రాగన్‌పాస్ అనే సంస్థతో ఉన్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్‌ఎల్) గురువారం ప్రకటించింది. "డ్రాగన్‌పాస్‌తో మా ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చేలా రద్దు చేయబడింది. అదానీ యాజమాన్యంలోని విమానాశ్రయాల్లోని లాంజ్‌లలోకి డ్రాగన్‌పాస్ కస్టమర్లకు ఇకపై ప్రవేశం ఉండదు. అయితే, ఈ మార్పు వల్ల ఇతర ప్రయాణికుల లాంజ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదు" అని ఏఏహెచ్‌ఎల్ ప్రతినిధి స్పష్టం చేశారు.

మరోవైపు, టర్కీకి చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ 'సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్'కు భారత విమానాశ్రయాల్లో మంజూరు చేసిన భద్రతా అనుమతులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. "జాతీయ భద్రత దృష్ట్యా డైరెక్టర్ జనరల్, బీసీఏఎస్‌కు దఖలుపడిన అధికారాల మేరకు సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన భద్రతా అనుమతులను తక్షణమే రద్దు చేస్తున్నాం" అని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ముంబై విమానాశ్రయంలో సుమారు 70 శాతం గ్రౌండ్ ఆపరేషన్లను (ప్రయాణికుల సేవలు, లోడ్ కంట్రోల్, విమాన కార్యకలాపాలు, కార్గో, పోస్టల్ సేవలు, వేర్‌హౌస్, బ్రిడ్జ్ ఆపరేషన్లు) సెలెబీనే నిర్వహిస్తోంది.

ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన, సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహొల్ ‘ఎక్స్‌’లో స్పందిస్తూ "భారత విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తున్న టర్కీ సంస్థ సెలెబీ నాస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌ను నిషేధించాలని దేశవ్యాప్తంగా అభ్యర్థనలు వచ్చాయి. సమస్య తీవ్రతను, జాతీయ ప్రయోజనాలను కాపాడాలన్న పిలుపును గుర్తించి, ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నాం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సదరు కంపెనీ భద్రతా అనుమతులను రద్దు చేసింది. దేశ భద్రత, ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యం" అని తెలిపారు.

కొన్ని నివేదికల ప్రకారం, సెలెబీ సంస్థలో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ కుమార్తె సుమేయే ఎర్డోగాన్‌కు పాక్షిక వాటాలున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త సెల్కుక్ బైరక్టార్, పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన బైరక్టార్ సైనిక డ్రోన్లను తయారు చేసే వ్యక్తి కావడం గమనార్హం. పాకిస్థాన్‌కు మద్దతు అనేది కేవలం టర్కీ ప్రభుత్వ విధానమే కాకుండా, ఇందులో ఎర్డోగాన్ కుటుంబం కూడా నేరుగా పాలుపంచుకుంటున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో భారత విమానయాన రంగంలోకి ప్రవేశించిన సెలెబీ, అనతికాలంలోనే తన కార్యకలాపాలను విస్తరించింది.


More Telugu News