ఈ నెల 7న సమ్మె.. హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ నిరసన ర్యాలీ

  • హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల కవాతు
  • చర్చలకు పిలవలేదంటూ జేఏసీ ఆగ్రహం
  • ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కవాతు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) సమ్మెకు సిద్ధమవుతోంది. ఈ నెల 7వ తేదీన తలపెట్టిన సమ్మెకు సన్నాహకంగా కార్మికులు సోమవారం హైదరాబాద్‌లో భారీ కవాతు నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్‌ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బస్‌ భవన్‌ వరకు కొనసాగింది. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్‌ భవన్‌ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.


More Telugu News