: తెలంగాణ ఆస్తులను కాపాడింది టీడీపీయే: ఎర్రబెల్లి ఉద్ఘాటన
బయ్యారం ఉక్కును విశాఖ తరలించకుండా పోరాడింది టీడీపీయేనని, తద్వారా తెలంగాణ ఆస్తులను కాపాడింది తమ పార్టీయేనని సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్ఘాటించారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు టీఆర్ఎస్ నోరు మెదపలేదని ఆయన విమర్శించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంలో అక్రమ కేటాయింపులు జరిగిన వేళ కూడా టీఆర్ఎస్ మౌనంగానే ఉందని.. తెలుగుదేశం పార్టీ ఆ అవినీతిపై మడమతిప్పని పోరాటం సల్పిందని దయాకర్ రావు గుర్తు చేశారు. బయ్యారం గనులను వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కు కేటాయించినపుడు టీఆర్ఎస్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. బయ్యారం గనుల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని తరలించిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.