కేదార్‌నాథ్ ఆల‌యానికి తొలిరోజు పోటెత్తిన భ‌క్తులు.. 30వేల‌ మందికి పైగా భ‌క్తుల‌ ద‌ర్శ‌నం

  • శుక్రవారం ఉద‌యం తెర‌చుకున్న కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాలు
  • నిన్న ఒక్క‌రోజే రికార్డుస్థాయిలో 30 వేల మందికిపైగా భక్తుల ద‌ర్శ‌నం  
  • ఇందులో 19,196 మంది పురుషులు.. 10,597 మంది మహిళలు.. 361 మంది ఇతరులు
కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణతో కేదార్‌నాథుని ఆలయ ద్వారాలు తెరచుకున్న విష‌యం తెలిసిందే. నిన్న‌ సాయంత్రం 7 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,196 మంది పురుషులు ఉండగా, 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

శుక్రవారం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న‌ సందర్భంగా భారత సైన్యం యొక్క గర్హ్వాల్ రైఫిల్స్ బృందం భక్తి గీతాలను వాయించింది. అలాగే ధామ్ పోర్టల్ ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. కేదార్‌నాథ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్య సేవక్ భండారాలో భక్తులకు ముఖ్య‌మంత్రి ప్రసాదం పంపిణీ చేశారు. మే 4న బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయని ఈ సంద‌ర్భంగా సీఎం ధామి వెల్ల‌డించారు. 

సీఎం ధామి మాట్లాడుతూ... "దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను స్వాగతించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ప్రతి స్థాయిలో తీర్థయాత్రను నిరంతరం పర్యవేక్షిస్తుంది. తీర్థయాత్ర మార్గాల్లో వివిధ ప్రాథమిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. చార్ ధామ్ యాత్ర రాష్ట్ర జీవనాడి కూడా. ఈ తీర్థయాత్ర లక్షలాది మందికి జీవనాధారం" అని ఆయన అన్నారు.

కేదార్‌నాథ్ పునర్నిర్మాణ పనుల కోసం రూ. 2000 కోట్లు కేటాయించినట్లు సీఎం ధామి ప్ర‌క‌టించారు. అలాగే గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రోప్‌వే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.

కాగా, పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్ర‌తి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. 


More Telugu News