ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ

  • అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభ
  • హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • వర్చువల్ గా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం
  • ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. రాజధాని పనులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ... అనంతరం తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న పుణ్యభూమిలో  మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, నా మిత్రుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, శక్తిమంతుడు పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

"ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నాను. నాకు కనిపిస్తోంది ఒక నగరం మాత్రమే కాదు... ఒక స్వప్నం సాకారం కాబోతోందన్న భావన కూడా కలుగుతోంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుంది. నేడు దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాం. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు... ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులు వేయబోతున్నాయి. నేను వీరభద్రస్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి సాష్టాంగ ప్రమాణం చేస్తూ, ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

ఇంద్రలోకానికి రాజధాని అమరావతి... ఇప్పుడది ఆంధ్రప్రదేశ్ కు రాజధాని. స్వర్ణాంధ్ర ప్రదేశ్ కు శుభసూచకం. అమరావతి ఒక నగరం కాదు... ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి...  ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి విలసిల్లుతుంది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 

టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. కానీ నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాదులో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారులను హైదరాబాద్ పంపించి అక్కడి ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించాను. భారీ ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరెవ్వరూ లేరు. 

2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశాను. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించింది... ఇక ముందు కూడా సహకరిస్తుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది.

ఆనాడు ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలలు కన్నారు... ఈనాడు మనందరం కలిసి ఎన్టీఆర్ కలలను నిజం చేయాలి. వికసిత భారత్ కు ఏపీ ఒక గ్రోత్ ఇంజిన్ లా ఎదగాలి. చంద్రబాబు గారూ, పవన్ కల్యాణ్ గారూ... ఇది మనం చేయాలి... మనమే చేయాలి. 

ఏపీలో కనెక్టివిటీ పరంగా కొత్త అధ్యాయం మొదలవుతోంది. నాయుడుపేట-రేణిగుంట హైవే అందుకు నిదర్శనం. తిరుపతి వెంకన్న దర్శనం కోసం వెళ్లే వారు ఎంతో త్వరగా ఈ రహదారిపై ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్ల రూపాయల సాయం చేస్తోంది." అని ప్రధాని మోదీ వివరించారు.


More Telugu News