ఉప్పల్ స్టేడియంలోని స్టాండ్ పేరు వివాదం... అజారుద్దీన్ కు హైకోర్టులో ఊరట

  • ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు ఉన్న అజారుద్దీన్ పేరు తొలంగించాలంటూ అంబుడ్స్ మన్ ఆదేశాలు
  • హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్
  • అంబుడ్స్ మన్ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు
భారత మాజీ క్రికెట్ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు ఆయన పేరును తొలగించాలన్న నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను హైకోర్టు ఆదేశించింది.

గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, జస్టిస్ ఈశ్వరయ్య నార్త్ స్టాండ్‌కు ఉన్న అజారుద్దీన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను సుమారు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించానని, అందులో దాదాపు పదేళ్లు కెప్టెన్‌గా జట్టును నడిపించానని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రికెట్‌కు తాను చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని, అంబుడ్స్‌మన్ ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, ఆయన వాదనలతో ఏకీభవించింది. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు నార్త్ స్టాండ్ నుంచి ఆయన పేరును తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతానికి నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు యథాతథంగా కొనసాగనుంది. 


More Telugu News