రిలేషన్ షిప్ రూమర్లపై శుభ్ మన్ గిల్ స్పందన

  • కొంతకాలంగా గిల్ పై ఊహాగానాలు
  • ఓ ప్రముఖ క్రికెటర్ కుమార్తెతోనూ, నటితోనూ రిలేషన్ అంటూ పుకార్లు 
  • తన జీవితంలో అంత స్పేస్ లేదన్న గిల్
  • తాను ఎప్పుడూ కలవని వ్యక్తులతో కూడా ముడిపెడుతున్నారని వెల్లడి
భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా రిలేషన్‌షిప్ స్టేటస్‌పై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించాడు. తాను గత కొంతకాలంగా సింగిల్‌గానే ఉన్నానని, ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించానని స్పష్టం చేశాడు.

ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్ళలో శుభ్‌మన్ గిల్ ఒకరు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్, తన ప్రశాంతమైన కెప్టెన్సీ శైలితో ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే, మైదానం బయట కూడా గిల్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా, అతని రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సోషల్ మీడియాలో, పలు వెబ్‌సైట్లలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక ప్రముఖ క్రికెటర్ కుమార్తెతోనూ, బాలీవుడ్ నటితోనూ గిల్‌కు సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గిల్ ఈ పుకార్లపై స్పందించాడు. "నేను గత మూడేళ్లకు పైగా సింగిల్‌గానే ఉన్నాను. నా గురించి ఎన్నో ఊహాగానాలు, పుకార్లు వినిపిస్తున్నాయి. నన్ను వేర్వేరు వ్యక్తులతో ముడిపెడుతున్నారు. కొన్నిసార్లు అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే, నేను నా జీవితంలో కనీసం చూడని, కలవని వ్యక్తులతో కూడా సంబంధం అంటగడుతూ వార్తలు వస్తుంటాయి" అని గిల్ అన్నాడు.

ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు లేదా రిలేషన్‌షిప్‌కు సమయం లేదని గిల్ స్పష్టం చేశాడు. "నా ప్రొఫెషనల్ కెరీర్‌లో నేను ఏం చేయాలో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. సంవత్సరంలో దాదాపు 300 రోజులు మేము ప్రయాణిస్తూనే ఉంటాం. కాబట్టి, ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉండటానికి, సమయం కేటాయించడానికి నా జీవితంలో ప్రస్తుతం అంత స్పేస్ లేదు" అని గిల్ వివరించాడు.

మ్యాచ్ ఆడే సమయంలో తన మానసిక స్థితి గురించి కూడా గిల్ మాట్లాడాడు. "ఇది చాలాసార్లు చెప్పాను, అది ఒక ఆటోమేటిక్ స్విచ్ లాంటిది. మ్యాచ్ ఆడేటప్పుడు, ఆ జోన్‌లో ఉన్నప్పుడు, ప్రేక్షకుల అరుపులు గానీ, బయట ఏం జరుగుతుందో గానీ నాకు వినిపించదు. ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు, ఎన్ని పరుగులు చేయాలి, నేను ఏం చేయాలి అనే దానిపైనే నా పూర్తి ఏకాగ్రత ఉంటుంది" అని గిల్ తెలిపాడు. తన ముందున్న లక్ష్యంపైనే పూర్తి దృష్టి ఉంటుందని, బయటి ప్రపంచంతో సంబంధం ఉండదని పేర్కొన్నాడు.


More Telugu News